తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నేషనల్ కంపనీ లా ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నేషనల్ కంపనీ లా ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రారర్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చారు. తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని, 2019, ఆగస్ట్ 21న ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని.. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీకి సంబంధించిన షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్‌లో ప్రస్తావించారు.
తొలుత సోదరి అన్న భావనతో షర్మిలకు వాటాలు కేటాయించాలని భావించినని.. ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్‌ను విరమించుకున్నట్లు జగన్ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని, వారిద్దరికీ వాటాలు ఇవ్వదలుచుకోలేదని ఎన్‌సీఎల్‌టీని జగన్ అభ్యర్థించారు. ఎన్సీఎల్టీ ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం జగన్, భారతీలు ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన ఈ పిటిషన్ చర్చనీయాంశంగా మారింది.