వర్షం నీటిలో చిక్కుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వర్షం నీటిలో చిక్కుకుని మృతి చెందడం విషాదాన్ని నింపింది.
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వర్షం నీటిలో చిక్కుకుని మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన బాను రేఖ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కేఆర్ సర్కిల్ అండర్ పాస్ లో వర్షం నీటిలో మృతి చెందింది. బానురేఖ ప్రయాణిస్తున్న కారు వర్షం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న బానురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మృతిచెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. బానురేఖ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు.
సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు.ఆదివారం ఒక్కసారిగా వర్షం కురవడంతో కేఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్ లో వరద నీరు చేరింది. కారు నీటిలో చిక్కుకుపోవడంతో పోలీసులు వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. అయితే అధికారుల నిర్లక్షమే కారణమంటూ మృతురాలి సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అధికారులపై హలసూరుగేట్ పీఎస్ లో ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బానురేఖ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.