కొత్త ఎమ్మెల్యేల సరికొత్త పంథా.. వినూత్న కార్యక్రమాలతో ప్రజల వద్దకు

అసెంబ్లీ ఎన్నికల్లో వారు మొదటిసారి గెలిచారు. ఆ వెంటనే తమదైన ముద్ర ఉండాలని తహతహలాడుతున్నారు.

Update: 2024-09-19 02:00 GMT

దిశ, పల్నాడు: అసెంబ్లీ ఎన్నికల్లో వారు మొదటిసారి గెలిచారు. ఆ వెంటనే తమదైన ముద్ర ఉండాలని తహతహలాడుతున్నారు. వంద రోజుల్లోనే వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవ్వాలని ఆలోచిస్తున్నారు. వర్గ పోరుతో రగిలిపోయే పల్నాడులో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు సరికొత్త పంథాలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్ధి పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే తమ సత్తా చాటి పట్టు సాధించాలనుకుంటున్నారు. పల్నాడులో ఏడు నియోజకవర్గాలున్నాయి. వర్గ రాజకీయాలకు జిల్లా పెట్టింది పేరు. అయితే ముగ్గురు మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్నికై వంద రోజులు గడవక ముందే నియోజకవర్గంలో తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

డయల్ యువర్ ఎమ్మెల్యేతో..

పెదకూరపాడు నుంచి టీడీపీ అభ్యర్ధిగా మొదటిసారి బరిలోకి దిగిన భాష్యం ప్రవీణ్, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్ధి నంబూరు శంకర్రావును ఓడించారు. వరుసకు మామ అల్లుళ్లయ్యే వీరిద్దరూ ఎన్నికల సమరం ప్రారంభమైనప్పటి నుంచి ఢీ అంటే ఢీ అన్నారు. గెలిచిన తర్వాత భాష్యం ప్రవీణ్ తనదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తూనే సొంత ముద్ర ఉండేలా చూసకుంటున్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యే అంటూ కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. కాల్ సెంటర్ కు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు మండలానికొక ప్రజా సేవక్ ను నియమించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూనే తమదైన ముద్ర ఉండేలా ఇప్పటినుండే జాగ్రత్త పడుతున్నారు.

పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి..

ఇక నరసరావుపేట నుంచి చదలవాడ అరవింద బాబు టీడీపీ తరుఫున విజయం సాధించారు. వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకొని, అనూహ్యంగా గెలుపొందారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేటపై దృష్టి సారించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఉండేలా అధికారులకు సూచనలు అందిస్తున్నారు. మరోవైపు స్వయంగా డాక్టర్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. పలు దఫాలుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత ఎమ్మెల్యే అవినీతిపై పోరుబాట సాగిస్తూనే జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో తన పట్టు పెంచకుంటున్నారు.

అవినీతికి దూరంగా..

మాచర్ల నియోజకవర్గం నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి మొదటిసారి విజయం సాధించారు. నాలుగు ఎన్నికల తర్వాత టీడీపీ జెండా ఇక్కడ రెపరెపలాడించారు. వైసీపీ పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హవా నడిపించి. ఓడిపోగానే చతికిలపడి పోలీస్ కేసులతో వెనుకంజ వేయడంతో నియోజకవర్గంపై బ్రహ్మారెడ్డి పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా అవినీతి, అక్రమాలు దరి చేరనియటం లేదు. అభివృద్ధి మంత్రంతో ముందడుగు వేస్తున్నారు. గత ఎన్నికల్లో 31 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్దులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాంటి మున్సిపాలిటీని తొలి వంద రోజుల్లోనే జూలకంటి తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రత్యర్ధులు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలన్న విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.


Similar News