ప్రధాన పార్టీల అధినేతలకు నిద్ర కరువు.. వెంటాడుతున్న కొత్త టెన్షన్లు ఇవే!

పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్​ షర్మిల​ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ, బీజేపీలను తూర్పారబడుతున్నారు. రాష్ట్ర విభజన హామీలను సాధించడంలో వైసీపీ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు.

Update: 2024-03-30 02:36 GMT

రాష్ట్రంలోని ప్రధాన మూడు పార్టీల అధినేతలకు ఓ పట్టాన నిద్ర పట్టడం లేదు. షర్మిల ప్రభావం ఏమేరకు ఉంటుందనేది అధికార వైసీపీ అంచనాకు చిక్కడం లేదు. ఆమె వైసీపీ ఓటు బ్యాంకులను చీలుస్తారో.. లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకుంటారో అర్థం కావడం లేదు. ప్రతిపక్ష టీడీపీకి బీజేపీ గుబులు పట్టుకుంది. ఆ పార్టీ మీద వ్యతిరేకత తమకు ఎక్కడ తగులుతుందోనన్న బెంగ నెలకొంది. కాపు ఓట్లు ఎక్కడ చీలిపోతాయో.. ఎంతమేరకు గండి పడుతుందో అర్థంగాక జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ అంశాలు ఆయా పార్టీల నేతలను కలవరపెడుతున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్​ షర్మిల​ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ, బీజేపీలను తూర్పారబడుతున్నారు. రాష్ట్ర విభజన హామీలను సాధించడంలో వైసీపీ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. వివేకా హత్య కేసుపైనా గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యాక ఇవన్నీ ప్రభావం చూపించే అవకాశమున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును షర్మిల ప్రభావితం చేస్తే తమకు మేలు జరిగినట్లేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

తమ్ముళ్ల ఆందోళన ఇదే..

మరోవైపు బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని తమ్ముళ్లు సహించలేకపోతున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక జగన్​తోపాటు ఢిల్లీ బాద్​ షాలు ఉన్నట్లు వారు నమ్ముతున్నారు. మిగతా పార్టీలతో పోల్చుకుంటే టీడీపీలో అంతర్గత ప్రజా స్వామ్యం కొంచెం ఎక్కువ. కొద్దోగొప్పో అభ్యుదయ భావాలుంటాయి. అందువల్ల పార్టీ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని లోతుగా చర్చిస్తుంటారు. అందుకే రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చని బీజేపీ వల్ల తటస్థులు, ముస్లిం ఓట్లకు గండిపడుతుందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. నియంతృత్వ పోకడలతో ఉన్న జగన్​ను ఎదిరించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

కాపుల ఓట్లన్నీ జనసేనకు పడతాయా..

జనసేన పార్టీకి కాపులు పూర్తి స్థాయిలో మద్దతిస్తారని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరగా, హరిరామ జోగయ్య కాపు, బలిజ సంక్షేమ సేనను ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాపులు గంపగుత్తగా జనసేన వైపు నిలిచేట్లు కనిపించడం లేదు. కాపుల ఓట్లలో చీలిక తెచ్చేందుకు వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇదే జనసేన అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా మూడు పార్టీల ఓట్ల బదిలీపైనా బోలెడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి మూడు పార్టీల్లో తలెత్తుతున్న ఆగ్రహావేశాలు పార్టీలు మారేదాకా వెళ్తున్నాయి. ఈ పరిణామాలన్నీ తమ విజయావకాశాలకు ఎక్కడ గండి కొడతాయోననే అనుమానం మూడు పార్టీల అధిష్టానాలను కలవరానికి గురిచేస్తున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Tags:    

Similar News