6 కి.మీకు హెలికాప్టర్.. ఓ ప్రాణం కాపాడటానికి ఉపయోగించడం భారమేమీ కాదు
అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు.. కల్లాకపటం ఎరుగని మనుషులు.. మన గిరిజనులు.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు.. కల్లాకపటం ఎరుగని మనుషులు.. మన గిరిజనులు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారు’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.అటవీ ప్రాంతంలో అనువైన పంటలు పండించుకుంటూ... చెట్టుచేమలు, సకల జీవాలను దైవసమానంగా చూసుకొనే జీవ వైవిధ్య పరిరక్షకులు వారు అని పవన్ కొనియాడారు. ‘
గిరిజనుల జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవే. విద్య, వైద్యం, శుభ్రమైన తాగు నీరు వీరికి ఇప్పటికీ గగనకుసుమాలే. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతం.. మంచానికి కర్రలుకట్టి వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాసతో వారు ఆస్పత్రులకు వెళ్ళడం మనం ప్రసార మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము. ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుంది. ఈ పరిస్థితి మారాలి’ అని పవన్ కల్యాణ్ కోరారు. ఎంత వ్యయమైనప్పటికీ వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలి అని సూచించారు.
గిరిజనుల బాగుకోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ సంబంధిత విభాగాల్లో సేవాభావం కలిగిన వారిని నియమించి ఆ వ్యవస్థను పటిష్టపరచాలి అని కోరారు. అత్యవసర ఆరోగ్య సమయాలలో అడవిబిడ్డల కోసం ఎయిర్ అంబులెన్సుల ఏర్పాటుపై కార్యాచరణ చేయాలి అని సూచించారు. ఆరు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించడం భారమైన పని కాదు అని ఎద్దేవా చేశారు. అలాగే గిరిజన బాలబాలికలకు విద్య అందుబాటులో ఉంచాలి.. గిరిపుత్రులు వారు కోరుకున్న జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కనీస అవసరాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. గిరిజన లోకంలో చైతన్యం వెల్లివిరియాలని, వారు సుఖశాంతులతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Read More : ‘ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదే.. కానీ చిరంజీవి పిచ్చుక కాదు’
ఉత్తరాంధ్రపై పవన్ కల్యాణ్ ఫోకస్ .. రేపు టార్గెట్ చేసేది ఎవరినో?