కర్నూలు కేన్సర్ ఆస్పత్రికి రూ.72 కోట్లు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన
కేన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం కేంద్రం తన వాటా కింద రూ.72 కోట్లు భరిస్తున్నట్లు మంత్రి ప్రవీణ్ పవార్ వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం కేంద్రం తన వాటా కింద రూ.72 కోట్లు భరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇస్తూ కేన్సర్ చికిత్స కోసం దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలలో కేన్సర్ ఇన్స్టిట్యూట్లు, 20 టెరిషియరీ కేర్ కేన్సర్ సెంటర్లు నెలకొల్పాలన్న నిర్ణయంలో భాగంగానే కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం కర్నూలు మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు రూ.54 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌లో కేన్సర్ చికిత్సలో భాగంగా సర్జికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ సేవలను 2021లోనే ప్రారంభించగా ఎయిమ్స్‌లోని మెడికల్, సర్జికల్ స్పెషలిస్టులు అందరూ కేన్సర్‌కు చికిత్స అందిస్తున్నారని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు.