గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు కాదు: బీజేపీ ఎంపీ
చరిత్రను కొత్తగా రాసేందుకు బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను ఎప్పటికప్పుడు కొత్తగా.. ఎవరూ వినని విధంగా చెబుతూ ఏ దేశ చరిత్రను చెబుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతారు. ఇలా మాట్లాడడంలో సిద్దహస్తుడిగా పేరొందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే… మరోసారి కొత్త చరిత్రను చెప్పారు. ఉత్తర కన్నడ జిల్లాలో వీర్ సావర్కర్ సంస్మరణార్ధం జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, ‘‘గాంధీజీ సహా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నేతలెవరూ పోలీసుల చేతిలో లాఠీ […]
చరిత్రను కొత్తగా రాసేందుకు బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను ఎప్పటికప్పుడు కొత్తగా.. ఎవరూ వినని విధంగా చెబుతూ ఏ దేశ చరిత్రను చెబుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతారు. ఇలా మాట్లాడడంలో సిద్దహస్తుడిగా పేరొందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే… మరోసారి కొత్త చరిత్రను చెప్పారు. ఉత్తర కన్నడ జిల్లాలో వీర్ సావర్కర్ సంస్మరణార్ధం జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, ‘‘గాంధీజీ సహా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నేతలెవరూ పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినలేదు. అదంతా ఓ డ్రామా. బ్రిటిష్ వారి సహకారంతో ఆడిన పెద్ద నాటకం. గాంధీ చేసిన ఆమరణ నిరాహార దీక్షలు, సత్యాగ్రహం కూడా నాటకమే. బ్రిటిష్ వారి అనుమతితో, వారితో కుమ్మక్కై చేసిన స్వాతంత్య్ర సమరం’’ అన్నారు.
‘‘స్వాతంత్య్ర పోరాటాలు రెండు రకాలు. ఒకటి శస్త్రంతో (ఆయుధాలతో) కూడినది. రెండోది శాస్త్రయుతమైనది (మేధో పరమైన ప్రోద్బలంతో జరిగేది). ఈ రెండూ కాక మూడో రకం స్వాతంత్య్ర వీరులుంటారు. బ్రిటిష్ వారిని సంప్రదించి పోరాటం ఎలా చెయ్యాలో వారిని అడుగుతారు. మీరేం చెబితే అది చేస్తామని ఓ అవగాహనకు వస్తారు. మమ్మల్ని జైల్లో వేయాలని బ్రిటిషర్లను వేడుకుంటారు. మమ్మల్ని సరిగా చూసుకుంటే చాలు. అంతకుమించి అక్కర్లేదు అంటారు. మన పోరాట వీరులు ఈ మూడోరకం’’ అంటూ స్వాతంత్ర్య పోరాటాన్ని చులకన చేశారు.
‘‘గాంధీజీ సత్యాగ్రహాలతో బ్రిటిష్ వారు దేశాన్ని వదిలిపోలేదు. వారు విసిగిపోయి మనకు స్వాతంత్య్రం ఇచ్చారంతే! ఇలాంటి చరిత్రను చదివినపుడు నా రక్తం మరిగిపోతుంది’’ అంటూ ఆర్ఎస్ఎస్ వండిన భారత దేశ చరిత్రను సభికులకు వడ్డించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏ చరిత్ర పుస్తకాల్లో ఈ చరిత్రను చదివారో వెల్లడించాలని హెగ్డేను నిలదీస్తున్నారు. దేశచరిత్రను తిరగరాసిన స్వాతంత్ర్య పోరాట చరిత్రను కూడా వక్రీకరణ చేయడంలో బీజేపీ నేతలు ఒకర్నిమించి మరొకరు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.