వైసీపీయే ప్రధాన శత్రువు.. టీడీపీకి దూరం: అమిత్ షా

దిశ, ఏపీ బ్యూరో: 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం నుంచి దించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధాంతాలు కలిసిన పార్టీలతో కలుస్తామంటూ స్నేహహస్తం అందించారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు చేతులు కలపాలంటూ విజ్ఞప్తులు సైతం చేశారు. ఇదే తరుణంలో బీజేపీతో పొత్తుకు సైతం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని హోంశాఖ […]

Update: 2021-11-16 04:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం నుంచి దించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధాంతాలు కలిసిన పార్టీలతో కలుస్తామంటూ స్నేహహస్తం అందించారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు చేతులు కలపాలంటూ విజ్ఞప్తులు సైతం చేశారు. ఇదే తరుణంలో బీజేపీతో పొత్తుకు సైతం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పేశారు. అంతేకాదు టీడీపీకి సానుకూలంగా మాట్లాడే ఎంపీలకు సైతం కీలక సూచనలు చేశారు. వైసీపీకి ఎంతలా దూరంగా ఉంటున్నామో.. టీడీపీకి సైతం అంతే దూరంగా ఉండాలని ఆదేశించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ పొత్తు పొడవదేమోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. వైసీపీని కూడా అమిత్ షా వదిలిపెట్టలేదు. వైసీపీయే ప్రధాన శత్రువు అని స్పష్టం చేశారట. అక్కడితో ఆగిపోలేదు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

బలోపేతంపై దృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి సారించారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఉన్న అమిత్ షా సోమవారం ఏపీ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ బలోపేతమవ్వాలంటే ఇతర పార్టీలోని కీలక నేతలను ఆహ్వానించాలని.. తటస్థులను సైతం పార్టీలో చేర్చుకుని బలోపేతం చేయాలని ఆదేశించారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా నేతలు శ్రమించాలని హోంశాఖ మంత్రి అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని దాన్ని క్యాష్ చేసుకునేందుకు నేతలు కార్యక్రమాలు చేపట్టాలని అమిత్ షా సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని, ఏపీలో గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించారు.

ఏపీ నేతలకు షా క్లాస్

ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి వైసీపీయే ప్రధాన శత్రువు అని నేతలకు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యవహారాల కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావులు ఈ విషయాన్ని గ్రహించాలని.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రప్రభుత్వం వహిస్తున్న పాత్రను ప్రతీ గడపకు తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రప్రభుత్వం వల్ల రాష్ట్రప్రజలు లబ్ధిపొందుతున్న అంశాలను తెలియజేయాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024లో రాష్ట్రంలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని, ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. వీటన్నింటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారని.. ఇకపై మరింత పటిష్టంగా ఉండాలని నేతలకు షా సూచించారు.

సీఎం రమేశ్, సుజనా చౌదరిలతో ప్రత్యేకంగా భేటీ

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరిలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు గంటసేపు పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. టీడీపీకి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీతో ఎంతలా దూరంగా ఉంటున్నామో టీడీపీకి కూడా అంతే దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు వేరని.. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని దూరం పెట్టడమే మంచిదని షా సూచించినట్లు తెలుస్తోంది. అయితే అలాగే రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి సంబంధించి సీఎం రమేశ్, సుజనా చౌదరిలు మరింత వేగవంతంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇకపోతే టీడీపీతో పొత్తుకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ సహ ఇన్‌చార్జీ సునీల్ ధియోధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావులు చేసిన ప్రటనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా విరుద్ధ ప్రకటనలు వద్దని కలిసి పని చేయాలని సూచించినట్లు సమాచారం.

జనసేనను కలుపుకుని వెళ్లండి

ఇకపోతే రాష్ట్రంలో జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఉందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జనసేన పార్టీ మన మిత్రపక్షమని ఆ పార్టీని కలుపుకుని వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే సమయాల్లో జనసేనతో కలిసి ఉద్యమించాలని పేర్కొన్నారు. ఇరుపార్టీలు సంయుక్తంగా వైసీపీ, టీడీపీలపై పోరాటం చేసి పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా సూచించారు. జనసేనతో కలిసి ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలని అమిత్ షా పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా తమకు దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ‘ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించాం. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చింది. మిగిలిన అంశాలపై కూడా చర్చించాం. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. ఈ అంశంపై కూడా పోరాటం చేస్తాం’ అని బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరిలు తెలిపారు.

స్టీల్ ప్లాంట్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్‌ అని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించాలని సూచించారు. ఇకపై పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించాలన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్టు షా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీని దూరంగా పెట్టమని చెప్పిన అమిత్ షా.. వైసీపీయే ప్రధాన శత్రువు అని తేల్చిచెప్పడం ఒక విధంగా టీడీపీకి బూస్టప్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉంటున్నా భవిష్యత్‌లో కలిసి పనిచేసే అంశంపైనే సీఎం రమేశ్, సుజనా చౌదరిలతో చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఏంటనేది భవిష్యత్‌లో తేలాల్సి ఉంది.

Tags:    

Similar News