దద్దరిల్లిన సర్వసభ్య సమావేశం.. పోడు భూములపై రచ్చ రచ్చ
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పోడు భూముల సమస్యపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీ సమావేశం దద్దరిల్లింది. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వొడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పోడు భూములపై ప్రజా ప్రతినిధులకు అటవీ అధికారులకు మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. అటవీ అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిలోకి వెళ్లి రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అటవీ అధికారులపై ఆగ్రహం […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పోడు భూముల సమస్యపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీ సమావేశం దద్దరిల్లింది. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వొడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పోడు భూములపై ప్రజా ప్రతినిధులకు అటవీ అధికారులకు మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. అటవీ అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిలోకి వెళ్లి రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల జిల్లాలో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని ప్రజా ప్రతినిధులు.. జిల్లా కలెక్టరును కోరారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది రైతులు సాగు చేస్తున్న పోడు భూముల్లో విత్తనాలు వేయడానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారిని కోరారు.
‘పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు మాకు ఇన్ని చట్టాలు, ఖానూన్లు పెడుతున్నారు. మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీ పులుల పేరు చెబుతున్నరు.. ఇయ్యాల ప్రజలు సహకరించకుంటే పులులు పెరిగేవా.. అందరూ సహకరిస్తున్నరు. రోజుకు రెండు ఎద్దులు, బర్రెలు, ఆవులను కొడుతున్నయి.. ఇద్దరు మనుషులను చంపినయ్.. అయినా కూడా మీకు సహకరిస్తున్నం. ఇయ్యాల 11పులులు తెలంగాణలో వచ్చినయ్ అంటే గర్వపడుతున్నం. కానీ మీరు పోడు భూముల అంశం పెట్టి మా ప్రజలను ఇబ్బంది పెడితే ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్న. దయచేసి కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పష్టత తెండి. ముఖ్యమంత్రిగారు చెప్పారు. దీనిపై స్టేటస్ కో మెయింటెయిన్ చేయమని.. పాత భూముల జోలికి వెళ్లవద్దని అధికారులు చెబుతున్నరు. అయినా కూడా మీరు బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్లు బెదిరిస్తున్నరు. రైతులను, ఎద్దులను కొట్టడానికి మీకు ఎవరు ఇచ్చారు అధికారం.
మీరు మనుషులు కాదా.. ఇంతైనా మీకు మానవత్వం లేదా.. ఇబ్బంది పెట్టాలని మీరు ఏ పగతో చేస్తున్నారు. వేరే చోట డీగ్రేడ్ చేసిన ఏరియాలు.. అక్కడ పెట్టండి చెట్లు. ఒక్క సిర్పూర్ తాలూకానే దొరికిందా.. ఇది కక్ష కట్టి చేస్తున్నారా.. లేక రాజకీయంగా చేస్తున్నారా.. ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. ఇయ్యాల 40 గ్రామాల రైతులు నిద్రపోవటం లేదు. మేం గ్రామాల్లోకి పోతే రైతులు మమ్మల్ని తిడుతున్నరు. నిర్ణయం చేయండి. ఇలాగే కొనసాగితే ఆ 40గ్రామాల రైతులు, కుటుంబాలు, ఎద్దులను తెచ్చి కలెక్టరేట్ ముందు టెంటు వేసి అక్కడే బతుకుతాం. మీ కేసులు, దౌర్జన్యం మా అమాయక జనం భరించలేరు. మీరు బువ్వ పెట్టండి అక్కడే వచ్చి బతుకుతారు. మీరు గ్రౌండ్ లెవల్లో చేయలేదంటే నా ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా. నా రాజీనామా పత్రం ఇచ్చిపోత.. మీ గ్రౌండ్ లెవల్లో చేసే కార్యక్రమాలు వేరు. ముఖ్యమంత్రికి, మీ అధికారులకు ఇచ్చే రిపోర్టు వేరు. కొత్త ఎన్‌క్రోచ్మెంట్ అంటరు. ఆరేళ్లుగా ఎవరూ కూడా ఒక్క ఎకరం అడవి నరకలేదు. పాత భూములు తప్పా.. ఎవ్వరూ కొత్తవి కొట్లేదు. నేను గ్యారంటీ. మీరు రండి. ఒక ఎకరం కొట్టినా నేను జిమ్మేదారి. ఆరెపల్లి విలేజ్కు వెళ్దాం.
రైతులను 30,40, 50 ఏళ్లుగా సాగుచేస్తున్న భూములలోకి రానివ్వట్లేదు. వారిని బెదిరింపులకు గురి చేస్తున్నరు. ప్రశాంతంగా ఉన్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను అటవీశాఖ అధికారులు ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకెళ్లారు’ అని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మంగళవారం అటవీ అధికారులతో జరిగిన సమీక్షలో సమస్యలపై చర్చించడం జరిగిందని, రైతులు దీర్ఘకాలంగా కాస్తులో ఉండి సాగుచేస్తున్న భూమిలోకి అటవీ అధికారులు వెళ్లొద్దని సూచించినట్లు తెలిపారు. కొత్తగా అడవుల్లోకి వెళ్లకుండా చూడాలని అధికారులకు వెల్లడించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోకి పర్యటించినప్పుడు రైతులు మొదటగా పోడు భూముల సమస్యను విన్నవిస్తూ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పోడు భూములపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతున్న సందర్భంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయనకు మద్దతుగా తను కూర్చున్న సీట్ల నుండి లేచి ఆయన దగ్గరికి వచ్చారు.