ఉపశమన కేంద్రంతో ఊరట
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌తో కాళ్లకు పనిచెప్పి స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ఆ వలస జీవులకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రాల సరిహద్దులు మూసి వేయడంతో స్వగ్రామాలకు వెళ్లే వారిని నిలిపివేసిన అధికారులు వారికి ప్రత్యేకంగా ఉపశమన కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లా అధికారులు ఇంటిముఖం పట్టిన వలస కూలీల కోసం స్పెషల్‌గా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల ఉపశమన కేంద్రాలు ఉండగా కాళేశ్వరంలో 57మంది వలస కూలీలు ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా నడుచుకుంటూ వెలుతున్న కూలీలను […]
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌తో కాళ్లకు పనిచెప్పి స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ఆ వలస జీవులకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రాల సరిహద్దులు మూసి వేయడంతో స్వగ్రామాలకు వెళ్లే వారిని నిలిపివేసిన అధికారులు వారికి ప్రత్యేకంగా ఉపశమన కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లా అధికారులు ఇంటిముఖం పట్టిన వలస కూలీల కోసం స్పెషల్‌గా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల ఉపశమన కేంద్రాలు ఉండగా కాళేశ్వరంలో 57మంది వలస కూలీలు ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా నడుచుకుంటూ వెలుతున్న కూలీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఉపాధికి వెళ్లిన కూలీలకు ప్రస్తుతం రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన బయలుదేరారు. అయితే కేంద్ర, రాష్ట్రాలు వలస కూలీలను ఎక్కడికక్కడ ఆపి ప్రత్యేకంగా రిహాబిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాయి.
ప్రధానంగా హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఇతర నగరాల నుండి కూలీలు తమ స్వగ్రామలకు బయలుదేరారు. కాళేశ్వరం వద్ద అధికారులు పకడ్బందీగా రాకపోకలను నిలువరించారు. గోదావరి నదికి వెళ్లే దారులన్ని మూసివేయడంతో పాటు వంతెన వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. దీంతో కాళేశ్వరం చేరుకున్న వలస కూలీలను పోలీసులు పట్టుకుని ఉపశమన కేంద్రానికి తరలిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 57మంది వలస కూలీలు కాళేశ్వరం కేంద్రంలో ఉన్నారు. వీరికి ఆహారం అందిస్తోంది జిల్లా యంత్రాంగం. సరిహద్దు జిల్లా కావడంతో వలస కూలీల విషయంలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల రిహాబిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినా వాటిని తప్పించుకుని కాళేశ్వరం వరకు ఎలా చేరుకున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అలాగే సంబంధిత అధికారులకు మెమోలు కూడా జారీ చేస్తున్నారు. ఈ కేంద్రంలో మంచిర్యాల జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వలస కూలీలు ఉంటున్నారు.
నాలుగడుగుల దూరంలో ఊరు…
లాక్‌డౌన్‌తో తమ ఇళ్లకు ప్రయాణమై కాళేశ్వరంలో చిక్కుకున్న కొంతమంది వలసకూలీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ దరిలో ఉన్న తమ ఊరిని చూసుకుంటూ రోజులు వెల్లదీస్తున్న పరిస్థితి వీరిది. యూపీ, ఛత్తీస్‌గఢ్ కూలీలు తమ గ్రామాలకు చేరాలంటే ఇంకా వందల కిలోమీటర్ల మేర నడిచి వెల్లాల్సి ఉంది. కానీ గడ్చిరోలి, మంచిర్యాల జిల్లాకు చెందిన వలస కూలీలు కాళేశ్వరంలో చిక్కుకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీరిలో మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామానికి చెందిన వ్యక్తి గోదావరి నది దాటితే తమ ఊరికి చేరుకునే వాడు. కానీ ఇక్కడి పోలీసులు అతన్ని వెతికిమరీ పట్టుకుని రిహాబిటేషన్ సెంటర్‌కు పంపించడంతో గోదారి అవతలే మా ఊరును చూసుకుంటూ ఉండాల్సి వస్తుందే తప్ప ఊరికి వెళ్లే పరిస్థితి లేదని మదనపడుతున్నాడు. అలాగే గడ్చిరోలీ జిల్లా సిరొంచ తాలుకాలోని నగరం, రామంజపురం. గర్కపేట, టేకడ గ్రామాలకు చెందిన వారి పరిస్థితి ఇలాగే ఉంది. గోదావరి నదికి అవతలే ఉన్న తమ గ్రామాలకు చేరుకోలేకపోయామని మనో వేదనకు గురువుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనల వల్ల తామేమీ చేయలేని పరిస్థితి తయారైందని, కడుపునిండా ఆహారం అందించడం, వసతి కల్పించడం మాత్రమేనని అధికారులు అంటున్నారు.
అధికారులు బాగా చూసుకుంటున్నారు
– రాజమ్మ, నగరం, గడ్చిరోలి జిల్లా
హైదరాబాద్ నగరంలో ఉపాధి పొందుతున్నాను. లాక్‌డౌన్‌తో స్వగ్రామానికి వెళ్లాలని బయలుదేరా.. అనుకోకుండా కాళేశ్వరంలో పోలీసులు అడ్డుకుని ఈ కేంద్రానికి తరలించారు. అయితే కాళేశ్వరానికి అవతలి వైపు ఉన్న నగరం గ్రామం మాది. ఇంత దూరం వచ్చి మా ఊరికి చేరుకోలేకపోయానని బాధగా ఉంది. అయితే ఇక్కడ అధికారులు మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచి ఆహారాన్ని అందిస్తున్నారు.
ఫుడ్డు బావుంది
– సురేశ్ సాంబశివ్ వశేకర్
గడ్చిరోలి జిల్లా కొంగడా మాల్ మా స్వగ్రామం. హైదరాబాద్‌లో ఉంటున్నాను. లాక్‌డౌన్‌తో అన్ని దారులు మూసివేయడంతో మేమిక్కడ చిక్కిపోవల్సి వచ్చింది. కాళేశ్వరం రాగానే అధికారులు ఇక్కడకు తరలించి వసతి కల్పించారు. ఫుడ్డు వసతి అన్ని బావున్నాయి.
కరోనా టెస్టులు చేసి పంపించాలి
– దిలీప్ కుమార్, యూపీ
aవరంగల్‌లో ఉపాధి పొందుతుండేవాడిని. కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లాలని బయలుదేరాను. కాళేశ్వరం వద్ద అధికారులు ఆపి ఇక్కడకు తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్దార్థ్‌నగర్‌కు చెందిన తాము కాళేశ్వరంలో ఆగిపోవల్సి వచ్చింది. మా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేని పరిస్థితి తయారైంది. మాకు కరోనా టెస్ట్‌లు చేసి స్వగ్రామాలకు పంపిచేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలి.
Tags: lockdown, coronavirus, migrant workers, kaleshwaram, bhoopalapalli, goodwill, Maharashtra, Chhattisgarh, UP