వైద్యం పేరు చెప్పి బాలికతో వ్యభిచారం చేయించిన మహిళ
దిశ, ఏపీ బ్యూరో : తల్లితోపాటు ఆ బాలికకు కరోనా సోకింది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ తల్లి మరణించింది. బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. కరోనా సోకినప్పటి నుండి బాలిక నీరసంగా ఉంది. ఒకవైపు భార్య చనిపోవడం.. మరోవైపు కూతురు అనారోగ్యం పాలవ్వడంతో తండ్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ మహిళ బాలికకు నాటు వైద్యం చేయించి బాగు చేయిస్తానని తండ్రిని నమ్మించింది. ఆ తర్వాత బాలికను తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి […]
దిశ, ఏపీ బ్యూరో : తల్లితోపాటు ఆ బాలికకు కరోనా సోకింది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ తల్లి మరణించింది. బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. కరోనా సోకినప్పటి నుండి బాలిక నీరసంగా ఉంది. ఒకవైపు భార్య చనిపోవడం.. మరోవైపు కూతురు అనారోగ్యం పాలవ్వడంతో తండ్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ మహిళ బాలికకు నాటు వైద్యం చేయించి బాగు చేయిస్తానని తండ్రిని నమ్మించింది. ఆ తర్వాత బాలికను తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించింది. 13 ఏళ్ల బాలిక ఆ బాధ తట్టుకోలేక ఎలాగోలా తప్పించుకుని తండ్రి చెంతకు చేరింది. కడుపులో పెట్టుకుని చూసుకుంటానని నమ్మించి ఇలా పడుపువృత్తిలోకి దించడంతో ఆ బాలిక, తండ్రి బోరున విలపిస్తున్నారు.
ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పల్నాడులో వెలుగులోకి వచ్చింది. పల్నాడు సమీపంలోని ఓ కుటుంబం నివశిస్తుంది. కుటుంబ యజమాని గుంటూరులో ఓ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఆ కుటుంబంలో కరోనా విషాదం నింపింది. ఐదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల కూతురికి, భార్యకు కరోనా సోకడంతో యజమాని గుంటూరు జీజీహెచ్‌ల్ చేర్పించాడు. అయితే ఆస్పత్రిలో భార్య కన్నుమూసింది. కూతురు మాత్రం కోలుకుంది. అయితే గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ బాలిక అనారోగ్యం ఉందని.. ఆమెను బాగు చేయిస్తానని తండ్రికి చెప్పింది. తాను ఆస్పత్రిలో పనిచేసే నర్సునని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె మాటలు నమ్మిన తండ్రి బాలికను ఆమె వెంట పంపించాడు. ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పడంతో బాలికను ఓ గదిలో బంధించి వ్యభిచారం చేయించింది. ఆ తర్వాత గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విజయవాడలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. అయితే ఆ బాలిక వారి చెర నుంచి తప్పించుకుంది. తండ్రికి తనపై జరిగిన ఘోరాన్ని చెప్పుకుని గుండెలు పగిలేలా రోదించింది.
దీంతో తండ్రి బాధితురాలితో కలిసి గుంటూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించగా వారి సహకారంతో మేడికొండూరు పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరండల్‌పేట పీఎస్‌కు బదిలీ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికను తీసుకెళ్లింది నర్సు కాదని వ్యభిచార నిర్వాహకురాలని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె బాలికను విజయవాడలో వదిలేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక అనారోగ్యం పాలవ్వడంతోనే వదిలేసిందా..? లేక బాలిక తప్పించుకుందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నాటు వైద్యం పేరుతో కూతురును తీసుకెళ్లిన మహిళ ఇన్నిరోజులు అప్పగించకపోయినా తండ్రి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అన్న కోణంలోనూ విచారిస్తున్నామని గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు తెలిపారు. బాధిత బాలిక కోలుకున్నాక పూర్తిస్థాయిలో విచారిస్తామని వెల్లడించారు. బాలిక నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు తెలిపారు.