ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి : తమ్మినేని

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖాళీలను కాలపరిమితిలో మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీపై స్పందించకుండా రాష్ట్రానికే పరిమితమై బాధ్యతరహితంగా మాట్లాడడం […]

Update: 2021-07-11 09:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖాళీలను కాలపరిమితిలో మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీపై స్పందించకుండా రాష్ట్రానికే పరిమితమై బాధ్యతరహితంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 22 శాతం, సుమారు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని వ్యయశాఖ ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి, అందులోని ఉద్యోగులను తొలగించి, భవిష్యత్‌లో ప్రభుత్వరంగం లేకుండా, కొత్త ఉద్యోగాలు రాకుండా, రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దళిత, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు పోతాయని, ఇవేవీ పట్టని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దొంగే – దొంగ దొంగ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రకటనలు పక్కనపెట్టి కేంద్రస్థాయిలో ఉద్యోగాల గురించి మాట్లాడితే మంచిదని సూచించారు.

రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని, రెండు లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలు భర్తీచేస్తామని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీచేసి, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో కొవిడ్‌ నేపథ్యంలో అవసరాల నిమిత్తం 1640 మంది కాంట్రాక్ట్‌ నర్సులను 118 జీవో ప్రకారం ప్రభుత్వం నియమించిందన్నారు. కొవిడ్‌ పేషెంట్స్‌ కోసం రిస్కుతో కూడిన డ్యూటీలు చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడారని, వారి సేవలను గుర్తించి జీతభత్యాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించకుండా తొలగించడం అన్యాయం అన్నారు. నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం దురదృష్టకరన్నారు. ఒక పక్క మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ వైద్యశాఖను ఆదేశిస్తూ మరో పక్క మరోవైపు నర్సులను తొలగించడం ప్రభుత్వ అనాలోచిత చర్యని మండిపడ్డారు. ఇప్పటికే వైద్యరంగంలో సిబ్బంది, డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉందని, తొలగించిన నర్సులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News