అంతుచిక్కని ఏలియన్స్ మిస్టరీ.. సైన్స్ చరిత్రకారుడు ఏమన్నాడంటే..!
దిశ, ఫీచర్స్ : సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది? ఒక భూమ్మీదే జీవం ఉందా? వేరే గ్రహాలపై ఏం ఉంటుంది? విశ్వంలో మానవజాతితో పాటు మరికొన్ని జీవులుంటే అవి ఏ రూపంలో ఉన్నాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిరంతరం పరిశోధనకు పురికొల్పుతున్నాయి. నిజానికి ఈ సందేహాలకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. కానీ ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) మాత్రం ఉన్నారని కొందరు వాదిస్తే, ఉంటే మనతో ఎందుకు కనెక్ట్ కావడంలేదని కొందరు […]
దిశ, ఫీచర్స్ : సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది? ఒక భూమ్మీదే జీవం ఉందా? వేరే గ్రహాలపై ఏం ఉంటుంది? విశ్వంలో మానవజాతితో పాటు మరికొన్ని జీవులుంటే అవి ఏ రూపంలో ఉన్నాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిరంతరం పరిశోధనకు పురికొల్పుతున్నాయి. నిజానికి ఈ సందేహాలకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. కానీ ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) మాత్రం ఉన్నారని కొందరు వాదిస్తే, ఉంటే మనతో ఎందుకు కనెక్ట్ కావడంలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వాదన ఎప్పటి నుంచో కొనసాగుతుండగా.. పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన సైన్స్ చరిత్రకారుడు గ్రెగ్ ఎగిజియన్ యూఎస్‌లోని యూఎఫ్ఓ(అన్‌ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినన్)ల చరిత్రపై ‘హిస్టరీ ఆఫ్ యూఎఫ్‌ఓస్ ఇన్ ది యూఎస్’ అనే పుస్తకం రాశాడు. అతడి కోణంలో అసలు గ్రహంతరవాసులు చర్చ ఎప్పుడు మొదలైంది? అవి ఉన్నాయా? లేదా? అనే విషయాలు తెలుసుకుందాం.
మానవుడి అన్వేషణలో భాగంగా కొన్ని ఖగోళ రహస్యాలు తెలుసుకున్నా.. ఇప్పటికీ అంతుచిక్కనివి ఎన్నో ఉన్నాయి. గ్రహాంతరవాసుల ఉనికి కూడా ఓ మిస్టరీగానే ఉంది. భూమి ఆవల మరో ప్రపంచముందని, అక్కడ మనలాంటి మనుషులు జీవిస్తుంటారనే ఆలోచన ప్రాచీన కాలం నుంచే మొదలవగా.. 18వ శతాబ్దం నాటికి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, వేదాంతవేత్తలు దీనిపై పెద్దఎత్తున చర్చలు జరిపి, గ్రహాంతర నాగరికతలు ఉన్నాయని అంగీకరించారు. ఇక 19వ శతాబ్దంలో ప్రజలు ‘ఫ్లైయింగ్ షిప్స్’ చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి వస్తువులు క్రమం తప్పకుండా ఆకాశంలో కనిపించడంతో ప్రజలు వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వాటిని చూసిన కొంతమంది అవి గ్రహాంతరవాసులవే అని ప్రచారం చేశారు.
1947లో ఏం జరిగింది?
కెన్నెత్ ఆర్నాల్డ్ అనే పైలట్ తన చిన్న విమానంలో వాషింగ్టన్‌లోని మౌంట్ రైనర్ సమీపంలో ఎగురుతున్నాడు. అదే సమయంలో తనకు సమీపంలోనే ప్రకాశిస్తున్న ఓ వస్తువు చూశాడు. అయితే దాన్ని మరొక విమానంగా భావించి, దాన్ని ఢీకొట్టబోతున్నానని ఆందోళనకు గురయ్యాడట. అయితే అలాంటి ప్రమాదమేమీ జరగకుండా అతడు సేఫ్‌గా ల్యాండ్ కాగా, ఆ దృశ్యాలను సమీపంలోని విమానాశ్రయంలోని అధికారులకు నివేదించాడు. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ అవి సాసర్‌లా కనిపించాయని చెప్పడంతో జర్నలిస్టులు ‘ఫ్లయింగ్ సాసర్స్’గా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సంఘటన జరిగిన ఆరు వారాల తర్వాత 90 శాతం అమెరికన్లు ‘ఫ్లయింగ్ సాసర్’ గురించే చర్చించారు. కొద్ది రోజుల్లోనే దేశంలోని ఇతర వ్యక్తులు కూడా ఆకాశంలో ఇలాంటి వస్తువులు చూసినట్లు చెప్పారు. మరికొన్ని వారాల్లోనే యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం కూడా దీనిపై స్పందించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇదో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ కాలాన్ని కొందరు ‘ఫ్లయింగ్ సాసర్ శకం’గా అభివర్ణించారు.
యూఎఫ్‌ఓల పరిశీలన :
ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఆకాశంలో కనిపించే అవి ఎప్పుడూ భూమి వైపు రాలేదు. కానీ వాటితో ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఫ్లయింగ్ సాసర్ల విషయం తేల్చేందుకు ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్స్ చేపట్టింది. అయితే లోతైన శాస్త్రీయ విశ్లేషణపై ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో ఆశాజనక ఫలితాలు సాధించలేదు. మరోవైపు 1947- 1950 కాలంలో ప్రజలకు వాటిపై ఆసక్తి మరింత పెరిగింది. ఏమిటవి? నిజంగానే ఉన్నాయా? ఉంటే వాటి వెనుక ఎవరున్నారు? వంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రజలు వాటిని యూఎస్ మిలిటరీ/ సోవియట్ రహస్య విమానాలుగా భావించారు. ఈ క్రమంలోనే వాటిపై మక్కువ పెంచుకున్న అమెరికన్లు స్థానికంగా ‘ఫ్లయింగ్ సాసర్స్ క్లబ్స్’ ఏర్పాటు చేసుకున్నారు. కొద్దినెలల్లోనే ప్రపంచమంతా ఈ ట్రెండ్ కొనసాగింది. వాటి వల్ల ఏ హానీ జరగనప్పటికీ కొన్నేళ్లపాటు మానవాళికి, వాటికి మధ్య యుద్ధం జరుగుతుందేమోననే భయంతో ప్రజలు బతికారు. ఇక 2000 సంవత్సరం తర్వాత వాటి గురించి ప్రజలు పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం విశ్వాంతరాల్లోని ఇతర జీవుల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.
గ్రహాంతర జీవులు కనిపించిన ప్రతీసారి అవి తమకు ఇష్టమైన గమ్యస్థానంగా యునైటెడ్ స్టేట్స్‌ను ఎన్నుకుంటాయని హాలీవుడ్ నిర్ధారిస్తుంది. కానీ వాస్తవంగా చాలా దేశాలతో పాటు భారతదేశంలోనూ ఎగిరే వస్తువులను చూడటం గురించి చర్చలు దశాబ్దాలుగా ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఫ్లయింగ్ క్లబ్ సభ్యులు 1951లోనే ఆకాశంలో ‘సిగార్ ఆకారపు వస్తువు’ చూసినట్లుగా తెలిపారు. దాదాపు 17 నుంచి 20 మంది ప్రజలు ఆ వస్తువును చూడగా, అది 3 నిమిషాల పాటు కనిపించి మాయమైనట్లు వెల్లడించారు. ఈ సంఘటనను వివరిస్తూ ఏరియల్ ఫినామినన్‌పై జాతీయ దర్యాప్తు కమిటీ (NICAP) ‘బ్రిటిష్ వాంపైర్ జెట్ క్రూజింగ్ వేగం కంటే ఆ ఆబ్జెక్ట్ వేగం.. మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది’ అని అంచనా వేసింది. అదేవిధంగా చెన్నై నుంచి లక్నో వరకు ఇటువంటి UFO వీక్షణల గురించి కొన్ని నివేదికలు వివరించాయి. 2013లో భారత ఆర్మీ సైనికులు డెమ్‌చాక్‌లోని లడాన్ ఖేర్ ప్రాంతంపై యూఎఫ్‌ఓలను గుర్తించినట్లు నివేదించారు.
గ్రహంతర వాసులు ఉన్నారా? లేరా? అనే విషయం ఇప్పటికీ మిస్టరీనే. కానీ వాటిని గుర్తించే విషయంలో అంతరిక్షంలో కొంత పురోగతి సాధించాం. 1990ల తర్వాత ప్రత్యేకంగా ఆస్ట్రో ఫిజిస్ట్స్, ఆస్ట్రోనమర్స్ అనేక ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న చాలా గ్రహాలను కనుగొన్నారు. UFO ఫినామినన్ సులభంగా పరిష్కరించగల పజిల్ కాదు. ఇన్నేళ్ల పరిశోధనలో ఒక్క గ్రహాంతర వాసి కూడా మనకు చిక్కలేదు. శాస్త్రవేత్తలు పంపిస్తున్న సిగ్నల్స్‌కు స్పందించలేదు. ఉదాహరణకు మన గెలాక్సీలోనే కనీసం 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అనంత అంతరిక్షంలో ఎక్కడని వెతుకుతాం. ఏలియన్స్ ఉండే అవకాశం తక్కువే అయినా వారి కోసం అన్వేషణ నిరంతరం కొనసాగాలి. ఈ మిస్టరీనే శాస్త్రవేత్తలను మరింత పెద్దగా ఆలోచించేందుకు సాయపడితే, ప్రజలు విశ్వంలో మానవుని స్థానం గురించి కాకుండా సాంకేతికత, విశ్వజ్ఞాన పరిమితుల గురించి పెద్ద ప్రశ్నలు అడగడానికి అవకాశాన్ని ఇస్తుంది.