అప్పుల బాధ భరించలేక గొర్ల కాపరి సూసైడ్

చేసిన అప్పులు పెరిగిపోవడం... తద్వారా తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో మానసిక వేదనకు గురై గొర్ల కాపరి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-03-04 07:18 GMT

దిశ, భిక్కనూరు : చేసిన అప్పులు పెరిగిపోవడం... తద్వారా తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో మానసిక వేదనకు గురై గొర్ల కాపరి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన కోరే బీరయ్య (43) గత కొంతకాలంగా అప్పులు పెరిగిపోయి మానసికంగా ఆందోళన గురవుతున్నాడు. ఈ విషయమై తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగేవి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బీరయ్య కొన్ని నెలల క్రితం ఇంట్లో చెప్పా పెట్టకుండా అదృశ్యమయ్యాడు. ఆయన కోసం ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశారు.

సుమారు పక్షం రోజుల తర్వాత కుమారుడు నవీన్ గుర్తుకొచ్చి తనంతట తానే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించాడు. ఆ తర్వాత రెండు రోజులకు బీరయ్య తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్లీ గొర్లు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. గొర్లు కాస్తున్నా అప్పులు తీరకపోవడం, ఇంట్లో ఇదే విషయమై మళ్లీ గొడవలు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన బీరయ్య గొర్ల మంద వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు.

సిద్ధ రామేశ్వరాలయ సమీపంలో ఉన్న పట్టాల వద్దకు వెళ్లి పైలం బిడ్డా అంటూ నవీన్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుమారుడు నవీన్ ఏడ్చుకుంటూ అటువైపు వెళ్లి చూడగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయమై కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య చిన్న లక్ష్మి, కుమారుడు కుమార్తె ఉన్నారు.


Similar News