డిప్యూటీ తహసీల్దార్‌ను కాపాడుతుంది ఎవరు..? యాచకుడి కేసులో పోలీసులపై తీవ్ర విమర్శలు

సామాన్య ప్రజలు తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, ఒక రెవెన్యూ ఉద్యోగి (డిప్యూటీ తహసీల్దార్) ఓ వ్యక్తి ప్రాణాలు తీసినా కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఆర్మూర్లో సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-02-24 14:35 GMT

దిశ, ఆర్మూర్ : సామాన్య ప్రజలు తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, ఒక రెవెన్యూ ఉద్యోగి (డిప్యూటీ తహసీల్దార్) ఓ వ్యక్తి ప్రాణాలు తీసినా కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఆర్మూర్లో సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. యాచకుని ప్రాణాలు తీసిన వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్ కావడంతో రెవెన్యూ ఉన్నతాధికారులు రిమాండ్ చేయకుండా ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

అసలేం జరిగింది..?

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద కారు అద్దాలు తుడిచి డబ్బులు అడుక్కునే యాచకుడిని మెండోరా మండలం డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ ఆగ్రహంతో కాలితో తన్నగానే అతడు అటుగా వెళ్తున్న టిప్పర్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంఘటనా స్థలం నుంచి డీటీ కారులో పరార్ అయ్యాడు. పోలీసులు యాచకుడి మృతి పై చౌరస్తా వద్ద ఉన్న సీసీ పుటేజీ పరిశీలించగా డిప్యూటీ తహసీల్దార్ తన్నడం వల్లనే టిప్పర్ కింద పడి యాచకుడు మృతి చెందినట్లు స్పష్టమైంది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు కారు నంబర్ ఆధారంతో పాటు సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా గురువారం రాత్రి డిప్యూటీ తహసీల్డార్ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డీటీని పోలీసులు అదుపులో తీసుకోగానే టీఎన్జీవో నాయకులు జోక్యం చేసుకొని పెద్ద ఎత్తున పైరవీ చేసినట్లు తెలుస్తుంది.

టీఎన్జీవో నాయకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారా..?

అయితే శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 304/2 సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటలు గడిచినా డిప్యూటీ తహసీల్దార్‌ను కోర్టులో హాజరు పరచక పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ కేసులో జోక్యం చేసుకొని డిప్యూటీ తహసీల్దార్‌ను రిమాండ్ చేయకుండా పైరవీ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడితో పోలీసులు 48 గంటలు గడిచిన రిమాండ్ చేయలేదు. ఒక దశలో హత్యకు కారణమైన అధికారిని రక్షించడానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. రెవెన్యూ ఉద్యోగి కాకుండా ఒక సామాన్య వ్యక్తి ఇలాంటి తప్పిదం చేస్తే పోలీసులు ఈ విధంగా వ్యవహరించే వారా అని బాధిత కుటుంబ సభ్యులు, ఆర్మూర్ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ఎదుట హాజరు పరచాల్సి ఉన్నా గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని ఇప్పటి వరకు రిమాండ్ చేయకపోవడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మృతి చెందిన వ్యక్తి పేద కుటుంబానికి చెందిన యాచకుడు కావడతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 


Similar News