ఆ జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య..పాత కక్షలే కారణం!

జిల్లాలోని రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి గొల్ల ఆదెప్ప (50) దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు.

Update: 2024-07-10 07:49 GMT

దిశ ప్రతినిధి,అనంతపురం:జిల్లాలోని రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి గొల్ల ఆదెప్ప (50) దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. గతంలో మెచ్చిరి గ్రామ ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. హత్యకు పాత కక్షలే కారణమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కర్ణాటక పరిధిలో హత్య చేసి సరిహద్దులోని పెదారగుడ్డం- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామ సరిహద్దులో మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల్లోకి వెళుతుండగా ప్రధాన రహదారిలో పడి ఉన్న అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, గుంతకల్ డీఎస్సీ శివ భాస్కర్ రెడ్డి, ముగ్గురు సీఐలు, ఎస్సైలు, పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఘటన స్థలానికి రాత్రి వేళ చేరుకున్నారు. అనంతపురం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య ప్రదేశంలోని ఆనవాళ్లు సేకరించారు. గ్రామంలో గత ఏడాది టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో పోలీసులు 16 మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారు. వైసీపీ వర్గీయులపై నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గొల్ల ఆదెప్ప ను వైసీపీకి చెందిన ప్రత్యర్థులు వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని, ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక సరిహద్దులోని మెచ్చిరి గ్రామం వద్ద పడేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News