శారీరకంగా కలిసినప్పుడు కులం గుర్తుకు రాలేదా డియర్ ప్రియుడా..?

నువ్వు లేని లోకం లేదు.. ఆ జీవితమే వేస్ట్.. కలిసి బతికితే నీతోనే.. అంటూ ప్రామీస్ చేశాడు. ఇంకేం.. అతడే సర్వస్వం అనుకుంది.

Update: 2024-08-10 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: నువ్వు లేని లోకం లేదు.. ఆ జీవితమే వేస్ట్.. కలిసి బతికితే నీతోనే.. అంటూ ప్రామీస్ చేశాడు. ఇంకేం.. అతడే సర్వస్వం అనుకుంది. అతడి మాయమాటలకు పడిపోయింది. అతడి ప్రేమకు దాసోహం అయిపోయింది. అంతే ఆమెను ఓ గదిలో పెట్టి సహజీవనం చేశాడు.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. మోజు తీరింది. ఇక సాకులే మిగిలాయి. నిలదీసిన ప్రియురాలికి నీది తక్కువ కులం.. నన్ను మరిచిపో.. అంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఇంటిబాట పట్టాడు. అప్పటి నుంచి తన ప్రేమను, ప్రియుడిని దక్కించుకునేందుకు ఆ ప్రియురాలు పడే బాధ అంతా ఇంతా కాదు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏలూరు జిల్లా పొలసానిపల్లికి చెందిన ఈగలాటి రవికుమార్ (25)కు భీమడోలు గ్రామానికి చెందిన యువతి (24)తో గత కొన్నాళ్ల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించిన రవికుమార్ ఆమెతో సహజీవనం చేశాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని యువతి రవి కుమార్‌‌ను కోరింది. అప్పుడు, ఇప్పుడు అంటూ వాయిదాలు వేసుకుంటూ పెళ్లి విషయాన్ని దాటవేస్తుండటంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని యువతి రవికుమార్‌ను గట్టిగా నిలదీసింది. దీంతో ప్రియుడు ఎస్కేప్ అయ్యాడు. మోసపోయానని గ్రహించిన యువతి రెండు నెలల క్రితం భీమడోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధిత యువతి యువకుడి ఇంటికి వెళ్లి నిలదీస్తే.. ‘నీది తక్కువ కులం.. మాది ఎక్కువ కులం.. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు’ అంటూ పెళ్లికి నిరాకరించాడు. దీంతో షాక్ తిన్న యువతి.. ‘నన్ను శారీరకంగా వాడుకున్నప్పుడు ఆ కులం గుర్తుకు రాలేదా..’ అంటూ నిలదీసింది. దీంతో రంగంలోకి దిగిన రవికుమార్ కుటుంబ సభ్యులు యువతిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లోకి వస్తే చంపేస్తామని ప్రియుడి అన్న, వదిన యువతిని బయటకు గెంటేశారు. అయితే ఘటనపై యువతి కన్నీటి పర్యంతం అయింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మితే మోసం చేశాడని, కుటుంబ సభ్యులు సైతం తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సైతం ఇప్పటి వరకు రవి కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. వెంటనే పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా, యువతి ఆందోళనకు దళత సంఘాలు మద్దతు తెలిపాయి. యువతికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని పేర్కొన్నాయి.


Similar News