మహానగరంలో మహారాణులు @80
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ‘లాలించే తల్లికి పాలించడం పెద్ద లెక్కా’.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని కార్పొరేటర్లుగా ఎన్నికైన మహిళలే ఏలబోతున్నారు. మహిళలే మహారాణులుగా బల్దియాలో అడుగు పెట్టబోతున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 150 డివిజన్లు ఉండగా,ఈ సారి ఎన్నికల్లో 80 మంది మహిళా కార్పొరేటర్లు ఎంపికయ్యారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో 75 మంది మహిళలు ఎంపిక కావాల్సి ఉంది. అయితే మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా మరో ఐదుగురు మహిళలు […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ‘లాలించే తల్లికి పాలించడం పెద్ద లెక్కా’.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని కార్పొరేటర్లుగా ఎన్నికైన మహిళలే ఏలబోతున్నారు. మహిళలే మహారాణులుగా బల్దియాలో అడుగు పెట్టబోతున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 150 డివిజన్లు ఉండగా,ఈ సారి ఎన్నికల్లో 80 మంది మహిళా కార్పొరేటర్లు ఎంపికయ్యారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో 75 మంది మహిళలు ఎంపిక కావాల్సి ఉంది. అయితే మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా మరో ఐదుగురు మహిళలు ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
కార్పొరేటర్లుగా 80 మంది..
బల్దియా ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయగా, పురుషులతో సమానంగా మహిళలు బరిలో నిలిచారు. వీరితోపాటు మేయర్ స్థానంపై కన్నేసిన రాజకీయ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపారు. దీంతో రిజర్వేషన్ స్థానాలకంటే అదనంగా ఐదుగురు మహిళలకు కార్పొరేటర్ అయ్యే అవకాశం లభించింది. ఇలా ప్రధాన పార్టీలైనా టీఆర్ఎస్ పార్టీ తరఫున అత్యధికంగా 30 మంది మహిళా కార్పొరేటర్లు ఈసారి బల్దియా ఎన్నికల్లో గెలుపొందగా, బీజేపీ నుంచి 28 మంది మహిళలు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. మజ్లీస్ పార్టీ నుంచి 20 మంది, కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు కార్పొరేటర్లుగా గెలుపొందారు.
గ్రేటర్ మహారాణి..
విశ్వనగరంగా పేరొందిన గ్రేటర్ కు మహిళనే మేయర్ కాబోతోంది. హైదరాబాద్ మేయర్ అంటే కోటిమందికిపైగా ఉన్న జనాభా మహానగరానికి తొలి పౌరురాలు. తెలంగాణకు ఆర్థిక యంత్రంలాంటి రాజధాని నగరాన్ని పాలించే బల్దియాకు చైర్‌పర్సన్. కల్పవృక్షం లాంటి జీహెచ్ఎంసీని ఏలడమంటే మామూలు విషయం కాదు. ఈసారి మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్ కావడంతో మహిళామణులు తెరపైకి వచ్చారు. మేయర్ పీఠంపై బడా నేతల కుటుంబాలు ఆశలు పెట్టుకున్నాయి.
ప్రధానంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, కీలక నేతలు తమ కోడళ్లను, ఒకరేమో భార్యను రంగంలోకి దింపారు. మేయర్ అభ్యర్థి కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. అయితే, ఈసారి మేయర్ పీఠం అధికార పార్టీకే దక్కనుండడంతో ముఖ్యనేతలు నేనంటే నేనని ముందుకొస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పదవి కోసం అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. చెర్లపల్లి కార్పొరేటర్ గా గెలుపొందిన మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి, భారతీనగర్ కార్పొరేటర్ సింధురెడ్డి, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, బంజరా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, ఖైరాతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పేర్లు మేయర్ రేసులో వినిపిస్తున్నాయి.