ఎల్ఆర్ఎస్ రద్దుతో 50 లక్షల మందికి మేలు

ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 50 లక్షల మందికి మేలు కలుగనుంది. నాలుగు నెలలుగా వారంతా అయోమయంలోనే ఉండిపోయారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ ​ప్రక్రియ లేకుండానే రిజిస్ట్రేషన్లను ఆమోదిస్తూ స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగిపోయాయి. […]

Update: 2020-12-29 21:38 GMT

ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 50 లక్షల మందికి మేలు కలుగనుంది. నాలుగు నెలలుగా వారంతా అయోమయంలోనే ఉండిపోయారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ ​ప్రక్రియ లేకుండానే రిజిస్ట్రేషన్లను ఆమోదిస్తూ స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగిపోయాయి. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కుదరదని పేర్కొంది. ఎల్​ఆర్ఎస్ పథకంపై సర్కారు పునరాలోచన చేస్తోందని ‘దిశ’ ముందుగానే చెప్పింది. ఈ మేరకు ఈ నెల 21న ఎల్ఆర్ఎస్​పై వెనక్కి? మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం’అనే శీర్షికన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను కథనంలో వివరించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ దీని ప్రభావం తీవ్రంగా పడిందని, చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తించారు. రానున్న నాగార్జున్ సాగర్ ​అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలలోనూ నష్టం కలిగించనుందని అంచనా వేశారు. పలువురు అధికారులతో చర్చించి ఎల్ఆర్ఎస్ అంశాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్లాట్ల వరకు క్రయ విక్రయాలు సాగే అవకాశాలు ఉన్నట్లు రియల్​ఎస్టేట్​ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అగ్రిమెంట్లతో ఉన్నవి వేల సంఖ్యలో ఉన్నాయి. అవసరాలకు అమ్ముకోవాలనుకునే వారికి మార్గం సుగమం అయ్యింది.

ఉత్తర్వుల సారమిదే

ఏ ఓపెన్ ప్లాటు, భవనం రిజిస్ట్రేషన్లయినా చేస్తారు. ఆ యజమాని పేరిట ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా చేపడుతారు. ఇప్పటికే లేఅవుట్ లోని ప్లాట్ చేతులు మారి ఉంటేనే మరొకరికి అమ్మొచ్చు. అదే అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను వెంచర్ యజమాని అమ్మడానికి వీల్లేదు. ఇప్పటికే ప్లాట్ కు కనీసం డాక్యుమెంట్ ఒక్కటైనా ఉంటే కొనుగోలు చేయొచ్చు. కొత్త ప్లాట్లు మాత్రం చేయరు. ఏదైనా ప్రాధికార సంస్థ అంటే హెచ్ఎండీఏ, డీటీసీపీ సంస్థలు ఆమోదించిన లేఅవుట్లలోని ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. మొదటి సారి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆమోదించిన లేఅవుట్లకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఇండ్ల అమ్మకంలో ఎలాంటి షరతులు లేవు. గతంలోనే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ చేయించుకున్న వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ మేరకు మెమో జారీ చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆగస్టు 26 నుంచి నిలిచిన లావాదేవీలు

అనుమతి లేని లేఅవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసేది లేదని, పంచాయత్​రాజ్​, మున్సిపల్​ కొత్త చట్టాల ఆధారంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని అప్పటి స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు అన్ని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆగస్టు 26న ఆదేశించారు. దాంతో క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత రెండు రోజులకే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పున:ప్రారంభించారు. రిజిస్ట్రేషన్లను ఆపేసి ప్లాట్ల యజమానులను భయపెట్టయినా ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం చూసిందన్న ఆరోపణలు వినిపించాయి. ఆందోళనకు గురైన జనం రోడ్డెక్కారు. అప్రూవ్డ్ లేఅవుట్లకు, అనుమతి పొందిన ఇండ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తామంటే 20 శాతం కూడా ఉండవని రియల్టర్లు స్పష్టం చేశారు. ఖజానా నింపుకోవడం తప్ప మరొకటి కాదని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జనంలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఎల్ఆర్ఎస్ కట్టినా టైటిల్​ గ్యారంటీ ఇవ్వనప్పుడు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కష్టాలను కథనాల రూపంలో ప్రభుత్వం దృష్టికి ‘దిశ’ పత్రిక తీసుకెళ్లిందని పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు.

ఉద్యమాన్ని ఆపేది లేదు

ప్రభుత్వాన్ని మూడు మెట్లు కిందికి దించాం. మరో మెట్టు దించే వరకు మా ఉద్యమం ఆగదు. నాలా చార్జీలను తగ్గించారు. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియపై వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్​ లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తామని అంగీకరించారు. ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలి. అది జరిగే వరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం. మరింతగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇల్లు ఉన్న ప్రతి యజమాని ఏదో ఒక రోజు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకం కింద డబ్బులు కట్టాల్సి వస్తుంది. జనానికి అవగాహన కల్పిస్తాం. –నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ రియల్టర్ల సంఘం

Tags:    

Similar News