గత నెలలో 464 ఫిర్యాదులు: స్వాతి లక్రా
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో మొత్తం 464 ఫిర్యాదులు అందాయని తెలంగాణ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. వీటిలో ఓ కేసులో 51 ఏండ్ల వయసున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలను వేధిస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉండగా, ఆ తర్వాత నల్లగొండ ఉందన్నారు. గత నవంబర్ నెలలో అందిన ఫిర్యాదులపై సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ కార్యక్రమానికి […]
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో మొత్తం 464 ఫిర్యాదులు అందాయని తెలంగాణ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. వీటిలో ఓ కేసులో 51 ఏండ్ల వయసున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలను వేధిస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉండగా, ఆ తర్వాత నల్లగొండ ఉందన్నారు. గత నవంబర్ నెలలో అందిన ఫిర్యాదులపై సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ కార్యక్రమానికి 120 మంది హజరైనట్టు ఆమె పేర్కొన్నారు. వీరిలో హైదరాబాద్ నుంచి 21 మంది, సైబరాబాద్ నుంచి 31 మంది, రాచకొండ నుంచి 12 మంది, వరంగల్ నుంచి 13 మంది, ఖమ్మం నుంచి 7 గురు, కరీంనగర్ నుంచి 6 గురు మిగతా వారు ఇతర జిల్లాల నుంచి హాజరైనట్టు చెప్పారు.
ఈ సందర్బంగా స్వాతి లక్రా మాట్లాడుతూ… తప్పు చేసిన వ్యక్తుల్లో మార్పు తీసుకురావడానికి ఆన్ లైన్ ద్వారా కౌన్సెల్సింగ్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకూ షీ టీమ్స్ పనితీరుకు 96 శాతం సంతృప్తి వ్యక్తం అయినట్టుగా ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు. షీ టీమ్స్‌కు పట్టుబడిన వారి వివరాలను షీ టీమ్ సాఫ్ట్ వేర్‌లో భద్రపరుస్తున్నట్టు చెప్పారు. మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ కు అందిన 464 ఫిర్యాదుల్లో నేరుగా 151 మంది, వాట్సాప్, ఈమెయిల్, ట్విట్టర్, హాక్ ఐ తదితర మీడియా ద్వారా 313 ఫిర్యాదులు అందాయని అన్నారు.
వీటిలో 218 మంది ఫోన్ ద్వారా, ఇతరులు స్టాకింగ్, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా ద్వారా వేధించారని అన్నారు. ఈ ఫిర్యాదుల్లో 90 కేసుల్లో హెచ్చరించి వదిలేయగా, 82 మందికి కౌన్సెల్సింగ్ ఇచ్చామన్నారు. 56 ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కాగా, మరో 52 ఫిర్యాదులను పెటీ కేసులుగా నమోదు చేశామన్నారు. అయితే, షీ టీమ్స్ ద్వారా అక్టోబరులో 200 మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా, నవంబర్‌లో ఫిర్యాదులు అందిన 150 మందిలో 120 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. మహిళా భద్రత విభాగం, షీ టీం లకు పట్టుబడ్డ పోకిరీలలో 114 మంది మేజర్లు కాగా, 18 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించారు.