భారతావనికి గాయకుల స్వరనీరాజనం !
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా ఉధృతి ఇంకా తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికుల త్యాగాలను, సేవలను కీర్తిస్తూ సినీ రచయితలు, హీరోలు, సంగీత కళాకారులు ఇదివరకే తమ పాటలతో కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సంక్షోభ సమయంలో ఒకే కుటుంబంగా నిలబడి, కలిసికట్టుగా పోరాడిన ప్రతి భారతీయుడికీ […]
దిశ, వెబ్ డెస్క్ :
దేశంలో కరోనా ఉధృతి ఇంకా తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికుల త్యాగాలను, సేవలను కీర్తిస్తూ సినీ రచయితలు, హీరోలు, సంగీత కళాకారులు ఇదివరకే తమ పాటలతో కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సంక్షోభ సమయంలో ఒకే కుటుంబంగా నిలబడి, కలిసికట్టుగా పోరాడిన ప్రతి భారతీయుడికీ అభినందనలు తెలియజేస్తూ సినీ గాయకులంతా కలిసి ఓ పాట పాడారు. దేశవ్యాప్తంగా ఉన్న గాయకులంతా ఒక తాటిపైకి వచ్చి ‘జయతు జయతు భారతం’ గీతాన్ని ఆలపించి ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన 200 మందికి పైగా గాయనీ గాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ గీతాన్ని ఆలపించిన వారిలో గాయకులు ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కైలాశ్ ఖేర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, సోను నిగమ్, ఎస్పీ శైలజ, మనో, సునీత, ఉష తదితరులు ఉన్నారు. కాగా మొత్తం 14 భాషల్లో (హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, అస్సామీ, కశ్మీరీ, సింధీ, రాజస్థానీ, ఒడియా) ఈ పాట ఉండటం విశేషం. ఈ పాట కోసం గాయనీగాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇస్రా (ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్) ప్రముఖ పాత్ర పోషించింది. ప్రసూన్ జోషి సాహిత్యం అందించిన ఈ పాటకు శంకర్ మహదేవన్ సంగీతం అందించారు. కరోనా వైరస్ సంక్షోభ సమయాల్లో కలిసికట్టుగా నిలబడిన ప్రతి భారతీయుడికి ‘జయతు జయతు భారతం’ 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం ద్వారా సెల్యూట్ చేస్తున్నామని ఇస్రా తెలిపింది.