బాలికల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘జ్యోతి’
దిశ, ఫీచర్స్: హర్యానా, కర్నాల్‌లోని గర్హి ఖజూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి, అమ్మాయిలకు ఉత్తమ భవిష్యత్తు అందించేందుకు ఉద్యమిస్తోంది. ఆమె పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు, చాలా మంది అమ్మాయిలు 10వ తరగతి వరకు చదువుకునేవారు. ఆ తర్వాత దాదాపు అందరూ చదువు మానేసేవారు. ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేయాలనే ఉద్దేశమే ఇందుకు కారణం కాగా.. ఆ గ్రామం నుంచి కాలేజీకి వెళ్లి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి అమ్మాయి తనే కావడం విశేషం. జ్యోతికి […]
దిశ, ఫీచర్స్: హర్యానా, కర్నాల్‌లోని గర్హి ఖజూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి, అమ్మాయిలకు ఉత్తమ భవిష్యత్తు అందించేందుకు ఉద్యమిస్తోంది. ఆమె పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు, చాలా మంది అమ్మాయిలు 10వ తరగతి వరకు చదువుకునేవారు. ఆ తర్వాత దాదాపు అందరూ చదువు మానేసేవారు. ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేయాలనే ఉద్దేశమే ఇందుకు కారణం కాగా.. ఆ గ్రామం నుంచి కాలేజీకి వెళ్లి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి అమ్మాయి తనే కావడం విశేషం.
జ్యోతికి ఆమె తల్లిదండ్రుల నుంచి బలమైన మద్దతు ఉన్నప్పటికీ, ఆ గ్రామంలో చదువుకోవాలనే కలను సాకారం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. ఊరిలో ప్రాథమిక పాఠశాల(5వ తరగతి వరకు) మాత్రమే ఉండగా, పై తరగతుల కోసం ఆమె ప్రతిరోజూ 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని పాఠశాలకు కాలినడకన వెళ్లేది. గ్రామంలో విద్యకు ప్రాధాన్యతనివ్వక పోగా, బాల్య వివాహాలు అధికంగా జరిగేవి. ఇక ఒక అమ్మాయికి 15 లేదా 16 సంవత్సరాలు నిండిన వెంటనే, ఆమెను పొలాల్లో మాన్యువల్ లేబర్ కోసం పంపుతారు. సాయంత్రం అయిందంటే ఇంటి నుంచి బయటకు రానివ్వరు. కానీ వీటన్నింటిని అధిగమిస్తూ డిగ్రీ పూర్తి చేసిన జ్యోతి.. బ్రేక్ త్రూ ఇండియా సంస్థ సభ్యురాలిగా గ్రామ స్వరూపాన్ని మార్చడంతో పాటు అక్కడి ప్రజల ఆలోచనా విధానాల్లోనూ మార్పు తీసుకొచ్చింది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించనట్లు.. ఈ జ్యోతి తన గ్రామంలోని అమ్మాయిల జీవితాల్లో జ్ఞాన జ్యోతి వెలిగిస్తోంది.
సాంస్కృతిక మార్పును సృష్టించడంతో పాటు బాలికలు, మహిళలపై వివక్ష, వారిపై జరిగే హింసను నిరోధించేందుకు ‘బ్రేక్ త్రూ’ పనిచేస్తోంది. యూఎస్, భారతదేశంలో పలు కార్యక్రమాల ద్వారా లింగ-ఆధారిత హింసకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సంస్థ అనేక గ్రామాల్లో మార్పు తీసుకురాగా.. జ్యోతితో కలిసి తన గ్రామంలో బాలికలు పాఠశాలలో చేరే సంభావ్యతను పెంచేందుకు కృషి చేసింది.
చదువుకోవడానికి నేను ఆసక్తి చూపించడంతో మా ఊరి వాళ్లు ‘యే తో మహారాణి హై’ (ఆమె రాణిలా ప్రవర్తిస్తుంది) అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఎన్నో రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరి వాతావరణాన్ని పాడు చేస్తున్నానంటూ తిట్టిపోశారు. ఆడపిల్లలు చదువుకుంటే తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని, పురాతన సంప్రదాయాలు, ఆచారాలను అగౌరవపరుస్తుందని అనేవారు. కానీ నా తల్లిదండ్రులు నాకు మద్దతిచ్చారు. నా విద్య పూర్తి చేసిన తర్వాత.. గ్రామంలోని ఇతర అమ్మాయిలకు విద్య విలువను వివరించాను. గర్హి ఖజూర్‌లోని ప్రతీ అమ్మాయి ఏదో ఒక రోజు కాలేజీకి వెళ్లాలనే కలతో పనిచేస్తున్నాను. గ్రామంలోని అబ్బాయిలు అమ్మాయిలను వేధించడాన్ని, వారిని చదువుకోనీయకుండా చేసే ప్రయత్నాలను నిరోధించాను. బ్రేక్ త్రూతో పనిచేయడం ప్రారంభించినప్పుడు, నేను నిర్వహించే ట్యూషన్ తరగతుల్లోని అమ్మాయిలతో యువజన సమూహాన్ని ఏర్పాటు చేశాం. అమ్మాయిల హక్కులు, ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యలు, అబ్బాయిల వల్ల కలిగే ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలను చర్చిస్తుండగా మార్పు కనిపిస్తోంది. త్వరలోనే అమ్మాయిలు కాలేజీకి వెళ్తారు.
– జ్యోతి