మూఢనమ్మకాలకు బలవుతున్న గుడ్లగూబలు.. వాటిని కూడా వదలకుండా

దిశ, ఫీచర్స్: భారతదేశంలోని అన్ని గుడ్లగూబ జాతులు వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 కింద రక్షింపబడుతున్నాయి. అయితే వీటిని వేటాడటం, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడం లేదా ఇతర దోపిడీలకు బలి చేయడం శిక్షార్హమైన నేరం. ఈ క్రమంలోనే భారతదేశంలో తరుచుగా అక్రమ రవాణాకు గురవుతున్న పదహారు జాతుల గుడ్లగూబలను గుర్తించింది ట్రాఫిక్ ఆర్గనైజేషన్. అలాగే ఆయా గుడ్లగూబ జాతులను గుర్తించి, వాటిపై అవగాహన పెంచడానికి ట్రాఫిక్(TRAFFIC), డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా(WWF-India) కృషి చేస్తుండగా.. ‘భారతదేశంలోని గుడ్లగూబలు’ అనే ఓ సమాచార పోస్టర్‌ను […]

Update: 2021-08-08 05:03 GMT

దిశ, ఫీచర్స్: భారతదేశంలోని అన్ని గుడ్లగూబ జాతులు వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 కింద రక్షింపబడుతున్నాయి. అయితే వీటిని వేటాడటం, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడం లేదా ఇతర దోపిడీలకు బలి చేయడం శిక్షార్హమైన నేరం. ఈ క్రమంలోనే భారతదేశంలో తరుచుగా అక్రమ రవాణాకు గురవుతున్న పదహారు జాతుల గుడ్లగూబలను గుర్తించింది ట్రాఫిక్ ఆర్గనైజేషన్. అలాగే ఆయా గుడ్లగూబ జాతులను గుర్తించి, వాటిపై అవగాహన పెంచడానికి ట్రాఫిక్(TRAFFIC), డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా(WWF-India) కృషి చేస్తుండగా.. ‘భారతదేశంలోని గుడ్లగూబలు’ అనే ఓ సమాచార పోస్టర్‌ను రూపొందించాయి.

గుడ్లగూబల అక్రమ రవాణా గురించి సరైన అవగాహన లేకపోవడంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించలేకపోయాయి. ఈ నేపథ్యంలో తాము రూపొందించిన కొత్త పోస్టర్ ప్రజల్లో అవగాహన పెంచుతుందని ట్రాఫిక్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే సుమారు 250 గుడ్లగూబ జాతుల్లో 36 భారతదేశంలోనే ఉన్నాయని వారు తెలిపారు. ఇక ఇండియాలోని అన్ని గుడ్లగూబ జాతులు వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972 కింద రక్షించబడుతుండగా, సైట్స్(CITES)-II జాబితాలో చేర్చడంతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని కూడా ఇది కఠినంగా నియంత్రిస్తుంది.

చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రతీ ఏటా మూఢచారాల పేరిట వందలాది పక్షులను బలి ఇస్తున్నారు. ముఖ్యంగా దీపావళి పండుగకు ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా తెలిపింది. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు గుబ్లగూబల పుర్రె, ఈకలు, చెవి టఫ్‌లు, పంజాలు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, రక్తం, కళ్ళు, కొవ్వు, ముక్కు, ఎగ్ షెల్స్, మాంసం, ఎముకలు వంటి భాగాలను ఇళ్లలో ఉపయోగించడం ఆచారంగా భావిస్తున్నారు. దాంతో మనదేశంలో గుడ్లగూబల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.

‘పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడంలో గుడ్లగూబలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పంటపోలాల్లో ఎలుకలను అదుపులో ఉంచడంలోనూ ఇవి కీలకమే. అంతేకాదు గుడ్లగూబలు వ్యవసాయ తెగుళ్ళకు చెక్ పెట్టి, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇలా మానవాళికి, పర్యవరణానికి సాయం చేస్తున్న వీటిని తరుచుగా బలితీసుకుంటున్నారు. ఈ ధోరణిలో మార్పురావడానికి ప్రజల్లో విస్తృత అవగాహన రావాలి. ఈ జాతులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత.
– డబ్ల్యూడబ్ల్యుఎఫ్-ఇండియా సెక్రటరీ జనరల్, సీఈవో రవి సింగ్

 

Tags:    

Similar News