14 శాతం ఆన్‌లైన్ విక్రయాలు సాధించిన మెర్సిడెస్ బెంజ్!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి పరిణామాల్లో తమ కార్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. సంస్థ ఆన్‌లైన్ విక్రయాలు 14 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది. అయితే, గతేడాది మొత్తంగా మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు 42 శాతం వరకు క్షీణించాయని తెలిపింది. కరోనా వ్యాప్తి, సంబంధిత పరిణామాల నేపథ్యంలో మొత్తం అమ్మకాలు తగ్గినప్పటికీ ఆన్‌లైన్ విక్రయాలు పెరగడం సంతోషంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి పరిణామాల్లో తమ కార్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. సంస్థ ఆన్‌లైన్ విక్రయాలు 14 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది. అయితే, గతేడాది మొత్తంగా మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు 42 శాతం వరకు క్షీణించాయని తెలిపింది. కరోనా వ్యాప్తి, సంబంధిత పరిణామాల నేపథ్యంలో మొత్తం అమ్మకాలు తగ్గినప్పటికీ ఆన్‌లైన్ విక్రయాలు పెరగడం సంతోషంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా 2020 ఏడాది చివరి నెలల్లో కంపెనీ అమ్మకాలు పుంజుకున్నాయని, తద్వారా కరోనా పూర్వస్థాయిలో 7,893 వాహనాలను విక్రయించినట్టు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఏడాది చివర్లో ఆన్‌లైన్ అమ్మకాలు సంస్థకు భారీగా దోహదపడ్డాయని, మొత్తం అమ్మకాల్లో ఆన్‌లైన్ ద్వారా 1,250 వాహనాలను విక్రయించినట్టు పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిచిన 15 నెలల కాలంలోనే ఈ స్థాయి అమ్మకాలు నమోదు చేయడం విశేషం. అంతేకాకుండా రానున్న ఐదేళ్ల కాలంలో 25 శాతం ఆన్‌లైన్ అమ్మకాల లక్ష్యానికి ఇది ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, అదే సమయంలో డీలర్‌షిప్‌లను కూడా అభివృద్ధి చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.