మెక్కింది.. కక్కండి..!

దిశ, ఆదిలాబాద్: ‘‘దస్ కా మాల్ బీస్..! ఆక్రీ బాటల్ హజార్ కా చార్ హజార్..’’ అంటూ లాక్ డౌన్ సమయంలో ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించి లిక్కర్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డ మద్యం వ్యాపారులపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది. మార్చ్ 22‌న జనతా కర్ఫ్యూకు ఒక రోజు ముందు అంటే 21వ తేదీన ప్రభుత్వం మద్యం దుకాణాల మూసివేత‌కు ఆదేశాలు ఇచ్చింది. ఆ రోజున వైన్ షాప్‌లలో ఉన్న మద్యం నిల్వల విలువను ఎక్సైజ్ అధికారులు […]

Update: 2020-05-08 06:08 GMT

దిశ, ఆదిలాబాద్:

‘‘దస్ కా మాల్ బీస్..! ఆక్రీ బాటల్ హజార్ కా చార్ హజార్..’’ అంటూ లాక్ డౌన్ సమయంలో ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించి లిక్కర్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డ మద్యం వ్యాపారులపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది. మార్చ్ 22‌న జనతా కర్ఫ్యూకు ఒక రోజు ముందు అంటే 21వ తేదీన ప్రభుత్వం మద్యం దుకాణాల మూసివేత‌కు ఆదేశాలు ఇచ్చింది. ఆ రోజున వైన్ షాప్‌లలో ఉన్న మద్యం నిల్వల విలువను ఎక్సైజ్ అధికారులు రికార్డు చేశారు. దాన్ని ప్రభుత్వానికి నివేదించారు. లాక్ డౌన్ ప్రకటించడంతో పాటు మే 7వ తేదీ దాకా పొడిగించడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న మద్యం వ్యాపారులు కొందరు అధికారులను మచ్చిక చేసుకుని, వైన్స్‌ తెరిచి మూడింతల అదనపు ధరలకు మద్యం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యాపారంపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పాటు కేంద్రం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేశారన్న సమాచారంతో ప్రభుత్వం మద్యం అక్రమార్కులపై చర్యలకు పూనుకుంది.

తిన్నదంతా కక్కేలా..

లాక్ డౌన్ సమయంలో దొడ్డిదారిన అడ్డగోలు సొమ్ము సంపాదించిన మద్యం వ్యాపారులకు దిమ్మతిరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు నెంబరు 302‌ను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన ఘనుల ప్రతి దుకాణం‌పై లక్ష రూపాయల పెనాల్టీ విధించింది. యంత్రాంగం కళ్లుగప్పి దుకాణాలను తెరవడం, స్టాక్ వివరాలను తారుమారు చేయడం, డ్రై డే రోజుల్లో మద్యం అమ్మిన దుకాణాలపై లక్షన్నర చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్ట్ షాపుల్లో, గోదాములలో దాచిన వ్యాపారులపై రూ.2 లక్షల జరిమానా‌తో పాటు మద్యం ఎం‌ఆర్‌పి ధరను వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అక్రమాలకు పాల్పడిన ఒక్కో మద్యం దుకాణం‌పై లక్ష రూపాయల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు పెనాల్టీ పడుతుంది.

మార్చి 21 నాటి లెక్కలే ప్రామాణికం..

జనతా కర్ఫ్యూకు ఒక రోజు ముందు అంటే మార్చి 21న రాష్త్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్‌లు, బార్లు, రిజిస్టర్డు క్లబ్బుల్లోని మద్యం నిల్వల లెక్కలను ఆబ్కారీ అధికారులు రాసుకున్నారు. ఆ సమాచారం ఆన్ లైన్‌లో ప్రభుత్వానికి పంపారు. తాజాగా ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చే ఒక రోజు ముందు కూడా అధికారులు లెక్కలు తీశారు. ఈ క్రమంలో అనేక మందు దుకాణాల్లో మద్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం తేలింది. అధికారులు నిర్ఘాంతపోయేలా లెక్కలు తేలడంతో అధికారులూ గుడ్లు తేలేశారు. ఈ వ్యవహారం తమకు ఎక్కడ చుట్టుకుంటుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఫుల్ పెనాల్టీస్..

నిబంధనలు ఉల్లంఘించిన మద్యం వ్యాపారులపై భారీ జరిమానాలు విధించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని వైన్స్‌ల సమాచారం అధికారులు సేకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 180 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. నిర్మల్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ఇచ్చోడ, మంచిర్యాల ప్రాంతాల్లో మద్యం షాపుల యజమానుల పెద్దమొత్తంలో అక్రమాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 50 శాతం లిక్కర్ దుకాణాలకు రెండున్నర నుంచి నాలుగున్నర లక్షల రూపాయల దాకా పెనాల్టీలు పడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వాటికి లక్ష నుంచి రెండున్నర లక్షలు జరిమానా పడొచ్చని అభిప్రాయపడుతున్నారు. వీటితో‌పాటు మరికొన్ని షాపులపై ఇప్పటికే నమోదైన పోలీసు కేసుల ఆధారంగా పెనాల్టీలు విధించనున్నారు. ఈ తాజా పరిణామాలు లిక్కర్ వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వద్దంటే వినకుండా అక్రమంగా అమ్మితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువగా పెనాల్టీ కట్టవలసి వస్తుందేమోనని కొందరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

పాత స్టాక్ పైనా కొత్త సుంకం..?

ఇదిలా ఉంటే ప్రభుత్వం మద్యం ధరలు 16 శాతం పెంచిన నేపథ్యంలో దాన్ని పాత స్టాక్‌పై కూడా వేసేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 21వ తేదీన ఉన్న స్టాక్ వివరాల మేరకు వైన్ షాప్‌లో మద్యం నిల్వలు లేనట్లయితే… ఆ మొత్తంపై పెంచిన ధరల ప్రకారం వసూలు చేస్తారని తెలుస్తోంది. ఇది జరిమానాల‌తో పాటు పెంచిన ధరల‌తో కలిపి వసూలు చేస్తే వ్యాపారులు భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. లాక్ డౌన్ సమయంలో చేసిన మద్యం దందా ఇప్పుడు వ్యాపారుల పాలిట శాపంగా మారుతోంది.

సర్కారుకు భారీ ఆదాయం..

మద్యం దుకాణాల‌పై ప్రభుత్వం విధించిన జరిమానాలతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు రెండు వేలకు పైగా మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 70 శాతం మేర యజమానులు లాక్ డౌన్ సమయంలో అక్రమాలకు పాల్పడి‌నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన జరిమానాల రూపంలో అటు ఇటుగా రూ.100 కోట్ల ఆదాయం రావొచ్చని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Tags: illegal selling, liquor, lock down time, excise dept, putting fines, on owners, expecting, 100 cr income

Tags:    

Similar News