సర్వే వివరాలు సరిగా నమోదు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపాధి రాజకీయ కుల సర్వేలో భాగంగా నిర్వహిస్తున్న

Update: 2024-11-18 10:17 GMT

దిశ, ఆదిలాబాద్ : సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపాధి రాజకీయ కుల సర్వేలో భాగంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర ఇంటింటి సర్వే లో వివరాలను తప్పులు లేకుండా సరిగా నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా సర్వే సిబ్బందికి సూచించారు. సోమవారం జైనాథ్ మండల కేంద్రం లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమారెటర్లు నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించి, ఫారంలో కుటుంబ వివరాలను సరిగా పూరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే పై ఇప్పటికే ప్రజల్లో కొంత అపోహ ఉందని అలాంటి అపోహలకు తావు లేకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లిన క్రమంలో వివరాల సేకరిస్తున్న సందర్భంలో ప్రజలకు సర్వే ఉద్దేశం తోపాటు దీనిపై వస్తున్న అపోహలను నివృత్తి చేసి, సర్వేకు సహకరించేలా చూడాలని అన్నారు.

అదేవిధంగా ప్రజలు తమ సందేహాలను సర్వే సిబ్బంది వద్ద వ్యక్తపరుస్తూనే పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ సర్వేలో ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు ఉద్యోగ, ఉపాధి,రాజకీయంగా అవకాశాలను అర్హులైన వారందరికీ అందించేందుకు, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి అవగాహన లేక కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, అలాంటి వాటికి తావు లేకుండా తమ సర్వే సిబ్బంది అడిగిన వివరాలను పూర్తిగా వెల్లడించాలని కోరారు.


Similar News