బ్రిడ్జి తెగి రెండుగా.. పదమూడు కష్టాలు..

బ్రిడ్జి తెగి..! రెండు@పదమూడు అన్నట్టు సాగుతుంది ప్రమాదంతో

Update: 2024-11-18 13:51 GMT

దిశ,భైంసా : బ్రిడ్జి తెగి..! రెండు@పదమూడు అన్నట్టు సాగుతుంది ప్రమాదంతో కూడిన రైతుల ప్రయాణం.వివరాల్లోకెళ్తే...నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు-పాత భూర్గుపల్లి(కె)గ్రామాల మధ్య వ్యవసాయ క్షేత్రాలను అనుసంధానం చేస్తూ దాదాపు ఇరవై సంవత్సరాల కిందట వంతెన నిర్మించగా,అది కాస్త కూలిపోయిందని రైతులు వాపోతున్నారు.అయితే గతంలో భూర్గుపెల్లి (కె) గ్రామస్థులకు కల్లూరు సమీపంలో పునరావాసం కల్పించగా పాత గ్రామ శివారులోనే వ్యవసాయ భూములు ఉన్నాయంటూ, అప్పట్లో అష్ట కష్టాలు పడ్డ రైతులకి రాకపోకలు సాగించేందుకు అధికారులు వంతెన నిర్మాణo చేయగా,గత తొమ్మిది నెలల క్రితం వంతెన కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు.

దీంతో రైతులు వారి వారి పంట పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన మార్గంలో పొలాలకు 2 కిలోమీటర్లు దూరం ఉండగా, తప్పించి వేరే రహదారిలో పంట పొలాలకు వెళితే 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో కొందరు రైతులు అక్కడ ఇక్కడ బ్రిడ్జి కొనలకు ఇనుప పైపుల సహాయంతో ప్రమాదకరంగా దాటుతున్నారు. మరికొందరు రైతులు తెప్ప ల సహాయంతో పంట పొలాలకు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు.ప్రయాణంలో ప్రమాదాలు సంభవించక ముందే సంబంధిత అధికారులు స్పందించి తమ కష్టాలను తీర్చాలని పలువురు గ్రామ రైతులు కోరుతున్నారు.


Similar News