యాస్ తుఫానుపై సన్నద్ధతను సమీక్షించిన అమిత్ షా

by Shamantha N |   ( Updated:2021-05-24 12:07:34.0  )
యాస్ తుఫానుపై సన్నద్ధతను సమీక్షించిన అమిత్ షా
X

న్యూఢిల్లీ: యాస్ తుఫాన్ బుధవారం బెంగాల్, ఒడిశాలపై తీవ్ర ప్రభావాన్ని వేయనుందన్న అంచనాల నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌తో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సకాలంలో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కరోనా నిబంధనల అమలు, చికిత్సపై పలుసూచనలు చేశారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రూపాల్లో సహాయం అందిస్తామని పేర్కొన్నారు. అసోం, సిక్కిం, మేఘాలయ సీఎంలతోనూ ఆయన భేటీ అయ్యారు. 26, 27వ తేదీల్లో ఈ రాష్ట్రాల్లో భారీగా వర్షాల పడే అంచనాలున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తుఫానుగా పరిణమించింది. బుధవారం అతితీవ్ర తుపానుగా పరిణమించనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. పారాదీప్, సాగర్ దీవుల మధ్య నుంచి బుధవారం మధ్యాహ్నం కల్లా ఒడిశాను, పశ్చిమ బెంగాల్‌ను ఈ తుపాను తాకనున్నట్టు అంచనా వేసింది. గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో కదలుతుందని పేర్కొంది. తుపాను సమయంలో అలలు 2 నుంచి 4.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశముందని తెలిపింది. సోమవారమే తుపాను ప్రభావం ఒడిశాలో కనిపించింది. తీరప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కనీసం 9 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు తీరప్రాంతాలకు వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయి. తుపాను కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు షెల్టర్ హోంలకు చేరాల్సిందిగా సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.

కేంద్రసహాయంపై అసంతృప్తి.. బెంగాల్‌పై వివక్ష

కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తామని చెప్పి రూ. 400 కోట్ల ముందస్తుగా అందించడానికి అంగీకరించిందని, తమకంటే చిన్న రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 600 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌పై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మళ్లీ వివక్షకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఈ మొత్తాలు రాష్ట్రాలకు రావాల్సినవేనని, అదనంగా అందిస్తున్నవి కావని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed