‘ఐ కాంట్ బ్రీత్’ ఎఫెక్ట్: బంకర్‌లోకి ట్రంప్

by Shyam |
‘ఐ కాంట్ బ్రీత్’ ఎఫెక్ట్: బంకర్‌లోకి ట్రంప్
X

వాషింగ్టన్/న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మరణం తీవ్ర ఉద్యమ రూపం దాల్చింది. ‘ఐ కాంట్ బ్రీత్’ (నాకు ఊపిరాడట్లేదు) పేరుతో ప్రారంభమైన ఉద్యమం వాషింగ్టన్, న్యూయార్ సహా మిగతా నగరాలకూ పాకింది. ఈ ఉద్యమం ఎంత తీవ్రంగా మారిందంటే ఏకంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్లిపోయారు. 2001 సెప్టెంబర్‌లో న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై దాడి జరిగిన సమయంలోనూ అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్ ఫ్లోరిడాలో ఉన్నారు. కానీ, ఇప్పటి ఉద్యమ ధాటికి డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్లిపోయారంటే ‘ఐ కాంట్ బ్రీత్’ ఎంత ఉధృతమైందో అర్థం చేసుకోవచ్చు.

ఎప్పుడు మొదలైంది?

ఐ కాంట్ బ్రీత్ ఉద్యమం ఇవ్వాళ కొత్తగా మొదలైంది కాదు. ఆరేండ్ల క్రిందట న్యూయార్క్‌లో ఎరిక్ గార్నర్ అనే నల్లజాతీయుడిపై పోలీసులు ప్రవర్తించిన తీరుతో అతను మృతి చెందాడు. అతడిని పోలీసులు చేతులు వెనక్కు విరిచి కట్టడంతో అతను ‘ఐ కాంట్ బ్రీత్’ అని పలుమార్లు అరిచాడు. అతని నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అవే. 2014 జులై 17న న్యూయార్క్‌లో సిగరెట్లను విడిగా అమ్ముతున్నాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు దాడి చేశారు. తాజాగా, మిన్నెపోలిస్‌కు చెందిన 46 ఏండ్ల జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా చనిపోయాడు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు అతను ఒక రెస్టారెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. కరోనాతో రెస్టారెంట్ మూత పడటంతో అతను ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. గత నెల 25న ఫోర్జరీ పత్రాలను వినియోగిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు జార్జిని కారులో నుంచి బయటకు లాగి రోడ్డుపై పడుకోబెట్టి మెడపై మోకాలితో తొక్కి పట్టారు. దీంతో జార్జ్ కూడా అక్కడే ప్రాణాలు వదిలాడు. కొనఊపిరితో ఉండగా, ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ పలుమార్లు అధికారులను వేడుకున్నాడు. దీంతో ఫ్లాయిడ్ మరణాన్ని అప్పట్లో ఎరిక్ మరణంతో పోల్చి చూసుకున్న అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజాతీయులపై పోలీసులు కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వందలాది మంది ప్రజలు రోడ్లపైకి చేరి తమ నిరసనలు ప్రారంభించారు.

రూజ్‌వెల్ట్ తర్వాత బంకర్‌లోకి వెళ్లిన రెండో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిని పలు విపత్తుల నుంచి కాపాడటానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బంకర్ నిర్మించారు. ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (పీఈఓసీ)గా పిలుచుకునే ఈ బంకర్ వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్ వైపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ బంకర్‌లో తలదాచుకున్నారు. కాగా, ఆ యుద్ధం తర్వాత అమెరికా ప్రభుత్వం బంకర్‌ను మరింత భద్రత కల్పించేలా మార్పులు చేసింది. అధ్యక్షుడు అక్కడి నుంచే పరిపాలన కొనసాగించేలా సకల ఏర్పాట్లూ ఆ బంకర్‌లో ఉంటాయి. సెప్టెంబర్ 11 దాడుల జరిగిన సమయంలో అప్పటి అధ్యక్షుడు ఫ్లోరిడాలో ఉండటంతో, ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, ఆయన భార్య లినీ, యూఎస్ ఆర్మీ మేజర్, ఇతర సీక్రెట్ సర్వీసెస్ అధికారులు బంకర్‌లో దాక్కున్నారు. ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్ తర్వాత బంకర్‌లోకి వెళ్లింది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే.

పోలీసుల ప్రవర్తన ఎప్పుడూ ఆందోళనకరమే..

అమెరికా పోలీసులు నల్లజాతీయులపై దురుసుగా ప్రవర్తించడం ఇదే మొదటి సారి కాదు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడుల చేయడం, కాల్చేయడం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అమెరికన్ నల్లజాతీయులతో పాటు శ్వేత జాతీయులు కూడా వేలాది మంది ప్రస్తుతం జరుగుతున్న ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కరోనాపై పోరాటం చేయడంలో ట్రంప్ విఫలమైన ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోసేలా తయారైంది. వేలాది మంది ప్రజలు ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ మాస్కులు, ప్లకార్డులు ధరించి వైట్ హౌస్ ఎదుట నిరసనలకు దిగారు. సోమవారం అక్కడ నిరసన ప్రదర్శనలు మరింత తీవ్రతరం కావడంతోనే అధికారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

అంతకు ముందు ఆందోళనకారులను ఉద్దేశించి ‘దుండగులు’గా అభివర్ణిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది ఆందోళనకు మరింత ఆజ్యం పోసినట్లైంది. పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ ఆందోళనలు ఏమాత్రం తగ్గటం లేదు. వేలాదిమంది నిరసకారులు రోడ్లు, పబ్లిక్‌ పార్కుల్లో గుమికూడి న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. ‘నాకు ఊపిరి ఆడటంలేదు. మీ చర్యలతో మేం విసిగిపోయాం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అల్లర్లను అదుపుచేసేందుకు న్యూయార్క్‌, మిన్నెపొలిస్‌ లాంటి డజనుకుపైగా నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. నిరసనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేలమంది నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు. రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోవడంతో పాటు లాక్‌డౌన్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రజలు గుంపులుగా గుమికూడటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. జార్జ్ మరణానికి కారణమైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనలు దేశమంతటా పాకుతుండటంతో వైట్ హౌస్ అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, పలుచోట్ల కొందరు పోలీసులు నిరసనకారులను శాంతింపజేసేందుకు మోకళ్లపై నిల్చుంటూ క్షమాపణలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed