సీబీఎస్ఈ పరీక్షలపై పునరాలోచనలో కేంద్రం..!

by Anukaran |   ( Updated:2021-04-12 23:03:45.0  )
సీబీఎస్ఈ పరీక్షలపై పునరాలోచనలో కేంద్రం..!
X

న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులేదని షెడ్యూల్ కూడా ప్రకటించిన కేంద్రం వెనక్కితగ్గినట్టు తెలుస్తున్నది. దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కారణంగా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో పరీక్షలు (ఆఫ్‌లైన్) నిర్వహించాలా..? వద్దా..? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. కొవిడ్-19 వీరవిహారం చేస్తున్న ఈ తరుణంలో విద్యార్థులను బయటకు పంపించడానికి వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే విషయమై రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ను కోరారు.

సీబీఎస్ఈ పరీక్షలను నిలిపేయాలని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా పరీక్షల నిర్వహణపై పునరాలోచనలో పడింది. షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరగాలి. అయితే ఒకవేళ పరీక్షలను రద్దు చేసినా అందుకు సంబంధించిన ప్రకటన కూడా ఇంత త్వరగా విడుదల చేసే అవకాశం లేదని సంబంధిత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed