‘మహా’ సీఎం కుర్చీకి కరోనా బెడద

by Shamantha N |   ( Updated:2020-04-23 07:18:47.0  )
‘మహా’ సీఎం కుర్చీకి కరోనా బెడద
X

దిశ, వెబ్‌డెస్క్ : వేల మందిని కబళిస్తున్న కరోనా మహమ్మారి.. ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్నది. ప్రభుత్వాల అప్రమత్తతకు పరీక్ష పెడుతున్నది. ఆర్థిక వ్యవస్థనూ కుదేలు చేస్తున్నది. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం వాటితోపాటు రాజ్యంగపరమైన చిక్కులనూ ముందుకు తెచ్చింది. కరోనా కాలం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పదవికి ఎసరుపెడుతున్నది. రాజ్యాంగబద్ధ పరిష్కారాన్ని కనుక్కోకుంటే ఉద్ధవ్ ఠాక్రే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చే అవకాశాలున్నాయి. ఆయన మహారాష్ట్ర సీఎంగా గతేడాది నవంబర్ 28న ప్రమాణం తీసుకున్నారు. కానీ, అప్పటి నుంచి రాష్ట్ర శాసన సభ లేదా మండలి సభ్యులుగా లేరు. రాజ్యాంగంలోని 164వ అధికరణం.. చట్ట సభ్యులు కానివారూ సీఎంగా ఆరు నెలలు కొనసాగే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని ప్రకారమే.. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే కొనసాగుతున్నారు. అయితే, ఠాక్రే డెడ్‌లైన్ మే 28వ తేదీతో ముగియనుంది. దీంతో ‘మహా’ సీఎం భవితవ్యంపై చర్చ మొదలైంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీ.. కాంగ్రెస్, ఎన్‌సీపీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవి లేకున్నా.. రాజకీయ కారణాలతో శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, ఎమ్మెల్యేగా పోటీ చేయకున్నా.. ఎమ్మెల్సీగా ఎన్నికై… సీఎం కుర్చీని కాపాడుకోవాలని ఠాక్రే భావించారు. మార్చి 26వ తేదీన తొమ్మిది శాసన మండలి సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. కానీ, ఇంతలోపే కరోనా మహమ్మారి ప్రవేశించి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నది. దేశంలో అత్యధిక కరోనా కేసులు ఇక్కడే వెలుగుచూడటం గమనార్హం. ఈ కరోనా వైరస్ మూలంగా.. ఎలక్షన్ కమిషన్.. ఈ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసింది.

పరిష్కారాలపై మంతనాలు :

కరోనాతో అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యాంగబద్ధ పరిష్కారాలు వెతుకుతున్నారు. నిపుణుల మేధోమథనం తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర గవర్నర్ బిఎస్ కొష్యారీని కోరింది. శాసన మండలిలో గవర్నర్ కోటా కింద రెండు వేకెన్సీలున్నాయి. కానీ, ఇప్పటి వరకు గవర్నర్ కొష్యారీ.. ఉద్ధవ్ ఠాక్రేను శాసన మండలి సభ్యునిగా నామినేట్ చేయలేదు. ఇందులోనూ రాజకీయాలతోపాటు కొన్ని న్యాయపరమైన అడ్డంకులున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 151ఏ… గవర్నర్ కోటా ఎంపికపై కొన్ని పరిమితులు విధించింది. శాసన మండలికి రాజీనామా చేసిన రాహుల్ నర్వేకర్, రామరావ్ వాడ్కుట్‌ల ఖాళీల పదవీకాల పరిమితి ఈ జూన్‌తో ముగియనుంది. కానీ, పైన చెప్పిన సెక్షన్ ప్రకారం.. ఈ ఖాళీ అయిన సీటు కాలపరిమితి ఏడాదికి తక్కువగా ఉంటే ఆ వేకెన్సీకి ఇతరులను నామినేట్ చేయరాదని సూచిస్తుంది. దీంతో ఈ రెండు సీట్లలో ఉద్ధవ్ ఠాక్రేను నామినేట్ చేసే అవకాశాలు సన్నగిల్లాయి. అదీగాక, మే 28వ తేదీతో ఆరు నెలల పదవీకాలాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రే పూర్తిచేసుకున్నట్టవుతుంది. ఈ తేదీలోపే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే, ఆరు నెల పదవీకాలం ముగిశాక మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేనే లేదా ఇతర పార్టీ నేతలనూ సీఎంగా ప్రమాణం స్వీకారం గావించి పదవిని కట్టబెట్టవచ్చు. మరో ఆరు నెలలపాటు వారు సీఎంగా కొనసాగే అవకాశమున్నది. కానీ, ఇలాంటి నిర్ణయాలపై ఇప్పటికే పలువిమర్శలున్నాయి. అదీగాక, ఈ నిర్ణయం అసమంజసం, అప్రజాస్వామికం, రాజ్యంగవిరుద్ధమని సుప్రీంకోర్టూ తీర్పునిచ్చింది. మరి కరోనా కష్టాలతో సతమతమవుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఇతర పరిష్కారాలను వెతుక్కుని తన సీఎం పదవిని కాపాడుకోగలడా? లేక రాజీనామా చేసి ఇతరులను సీఎం చేస్తారా? అన్నది తేలేందుకు వేచిచూడాల్సిందే.

Tags: maharashtra, uddhav thackeray, chief minister, tenure, sworn in, governor, next

Advertisement

Next Story

Most Viewed