- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా ‘బ్లాక్’ అయింది!
వాషింగ్టన్/వాటికన్ సిటీ: అగ్రరాజ్యం అమెరికా రగిలిపోతోంది. ఆఫ్రికన్-అమెరికన్ జాతీయుడైన జార్జ్ హత్యకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు వారం రోజులైనా తమ నిరసనలు ఆపడం లేదు. న్యూయార్క్, మిన్నెసొటా నగరంలో చెలరేగిన ఆందోళనలు ఇప్పుడు దేశమంతటా పాకిపోయాయి. 20 రాష్ర్టాలు, 40 నగరాల్లో అలజడి చెలరేగింది. ఆ ప్రాంతాలు కర్ఫ్యూ నీడన బిక్కుబిక్కుమంటున్నాయి. నల్లజాతీయుల నిరసన శ్వేత సౌధాన్ని తాకింది. అక్కడి ఆందోళనను ఆపడానికి పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ఒక పోలీసు అధికారి తన కారును బారికేడ్లపైకి నడిపించారు. కానీ, ఆ సమయంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే పోలీసుల దుశ్చర్యకు ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. దుకాణాలు, కార్యాలయాలు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. కర్ఫ్యూ అమలవుతున్నా నిరసనలు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు హెచ్చరికలు జారీ చేశారు. 24 గంటల్లోగా ఆయా రాష్ట్రాల్లో వెంటనే ఆందోళనలను అణచివేయాలని ఆదేశించారు.
ఫొటోలకు ఫోజులు..
ఆందోళనల నేపథ్యంలో బంకర్‌లోకి వెళ్లి తలదాచుకున్న ట్రంప్.. ఆ తర్వాత బయటకు వచ్చి రోజ్ గార్డెన్‌లో కొద్దిసేపు మాట్లాడారు. అదే సమయంలో ఆందోళనకారులు ఒక చర్చికి నిప్పు పెట్టారు. దీంతో ట్రంప్ ఆ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి బయటకు వచ్చి బైబిల్‌తో ఫొటోలకు ఫోజిచ్చారు. ట్రంప్ చేష్టలపై మతాధికారులే కాకుండా ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా మండిపడ్డారు. ట్రంప్ కావాలనే ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారని, ఆయన ఒక దేశాధ్యక్షుడై ఉండి కూడా ఈ ఆందోళనలను ఎందుకు రూపుమాపలేకపోతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. తాను ఫొటోలకు ఫోజివ్వడంపై కావాలనే రాద్దాంతం చేస్తున్నారని, చర్చికి వెళ్లడం తప్పా అని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఒక వేళ నిరసనలు శాంతియుతంగా తెలియజేయాలనుకుంటే.. ఆ చర్చికి నిప్పెందుకు పెట్టారు.. దానికి ప్రతిపక్షాలు మద్దతెందుకు ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఆందోళనలు తగ్గాలనే తాను చర్చికి వెళ్లి ప్రార్థన చేసినట్లు సమర్థించుకున్నారు.
అమెరికా ఘటనలపై పోప్..
అమెరికాలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్‌ది ముమ్మాటికీ జాత్యహంకార హత్యే అని వ్యాఖ్యానించారు. అల్లర్లు మరింతగా పెరిగి.. దేశాన్ని నాశనం చేయకముందే వాటికి ఒక పరిష్కారం కనుగొనాలని సూచించారు. జాత్యాహంకారం భరంచలేనిదే అయినా.. హింస మాత్రం తగదని ఆయన హితవు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఈ సమయంలో బంకర్‌లోకి వెళ్లడం విచారించదగ్గ విషయమన్నారు. ఒక్క జార్జ్ ఫ్లాయిడ్ గురించే కాకుండా.. జాతి వివక్ష కారణంగా మరణించిన అందరి కోసం తాను ప్రార్థిస్తున్నానని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.
జుకర్‌బర్గ్‌ను తాకిన సెగ
అమెరికాలోని ఆందోళనల సెగ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు తాకాయి. జార్జి హత్య నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మీ లూటింగ్ మొదలైతే మా షూటింగ్ మొదలవుతుంది’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు హింసను రెచ్చగొట్టేలా ఉన్నా ఎందుకు తొలగించలేదని కొందరు ఉద్యోగులు మార్క్‌ను నిలదీశారు. ట్రంప్ సందేశం ఎలాంటి హింసను ప్రేరేపించడం లేదని.. సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ పోస్టు లేదని మార్క్ స్పష్టం చేశారట. ట్రంప్ సందేశాలపై తాను నిర్ణయం తీసుకోనని చెప్పడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనట్లు సమాచారం. గతంతో మార్క్ చెప్పిన విషయాలని అబద్దాలని తేలిందని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో ఉంచమని చెప్పి.. ఇవ్వాళ ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడమేంటని వారు నేరుగానే ప్రశ్నించారు. ఈ ఉదంతంపై సుదీర్ఘ పోస్టు పెట్టిన తిమోతీ అవెనీ అనే ఇంజనీర్.. అనంతరం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
అసలే కరోనా కారణంగా గత మూడు నెలలుగా అతలాకుతలమైన అమెరికా.. ఇప్పుడు ఈ జాతి వివక్షపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అట్టుడుకుతోంది. అటు ట్రంప్ కానీ.. ఇటు ఆందోళనకారులు కానీ తగ్గేలా లేరు. వీటన్నింటికీ ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.