కేటీఆర్ వెళ్తారా? లేదా? టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ

by Shyam |   ( Updated:2021-10-13 22:09:29.0  )
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ వెళ్తారా? లేదా? అనే దానిపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ప్రచారానికి వెళ్తే ఓటర్ల మనస్సు గెలుచుకోవచ్చని.. విజయం నల్లేరుపై నడకే అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తు్న్నాయి. అయితే ప్రచారానికి మరో 13 రోజులు మాత్రమే ఉండటం… కేటీఆర్ పర్యటనపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఉప ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధానపార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపాయి. నువ్వా? నేనా? అన్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని వివరిస్తున్నాయి. అదే విధంగా ప్రతి ఓటరును కలుస్తున్నారు. తమకే ఓటువేయాలని కోరుతుండటంతో పాటు ఓటర్ల నాడి తెలుసుకునేందుకు , గెలుపోటములను బేరీజు వేసుకునేందుకు సర్వేలు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు పోతున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రచారం చేస్తే ఓటర్లు పక్కాగా టీఆర్ఎస్ కు ఓటు వేస్తారని, గెల్లు గెలుపు తధ్యమని ఇప్పటికే ప్రచారానికి రావాలని పార్టీ శ్రేణులు కోరాయి. అయితే ఇప్పటివరకు పర్యటనపై క్లారిటీ ఇవ్వలేదు కేటీఆర్. ఈ విషయంపై కేటీఆర్ ను మీడియా వివరణ కోరగా దాటవేత ధోరణి ప్రదర్శించారు. అయితే టీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలంగా రావడమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఓడినా… గెలిచినా నష్టమేమీ లేదంటూ పేర్కొంటూనే మరో పక్కా సర్వశక్తులు ఒడ్డుతుంది. కులసంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ హామీలను సైతం గుప్పిస్తున్నారు. అన్ని కులాల సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ పార్టీ, కార్యకర్తల సమావేశాలతో పాటు మీడియా సమావేశం నిర్వహించినా హుజూరాబాద్ ఉప ఎన్నిక చిన్నదని పేర్కొంటూ కొట్టిపారేస్తున్నారు. అయితే ఇంతకు పార్టీ ప్రచారానికి వెళ్తారా? లేదో? అని సందిగ్ధం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed