- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISRO : పీఎస్ఎల్వీసీ- 51 రాకెట్ ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయి సాధించింది. ఆదివారం ఉదయం 10.24 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-సీ51ని విజయవంతంగా ప్రయోగించింది. 19 ఉపగ్రహాలను సుమారు రెండు గంటల తర్వాత లాంచ్ వెహికల్ నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ప్రయోగించిన 17 నిమిషాల 23 సెకండ్లకు బ్రెజిల్ తొలిసారిగా స్వంతపరిజ్ఞానంతో రూపొందించిన అమేజోనియా-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన కక్ష్యలోకి చేర్చింది. మిగిలిన ఉపగ్రహాలన్నింటినీ ప్రయోగించిన తదుపరి ఒక గంట 38 నిమిషాల తర్వాత సక్సెస్‌ఫుల్‌గా నిర్దేశిత కక్ష్యలోకి పంపింది. అన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో వెల్లడించింది. ముందుగా నిర్దేశించుకున్నట్టుగానే ఉపగ్రహాలన్ని పీఎస్ఎల్వీ నుంచి విడిపోయాయని ప్రకటించింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగంలో మొదటిసారి ప్రైవేటు ఉపగ్రహాలనూ రోదసిలోకి పంపడం గమనార్హం. ఆదివారం పంపిన ఉపగ్రహాల్లో ఒకటి బ్రెజిల్, 13 అమెరికా, మిగిలిన ఐదు ఉపగ్రహాలు భారత్‌కు చెందినవి.
ఇందులో అమెరికాకు చెందిన 13, భారత్‌కు చెందిన ఒక కమర్షియల్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. అమేజోనియా మినహా ఇన్‌స్పేస్(స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్)కు చెందిన నాలుగు ఉపగ్రహాలు. ఇందులో ఇండియన్ అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్స్ కన్సార్టియం అభివృద్ధి చేసిన మూడు యునిటీశాట్స్, స్పేస్ కిడ్స్ ఇండియా రూపొందించిన ఒక శాటిలైట్ ఉన్నాయి. విద్యార్థుల్లో అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి పెంచడానికి ఏర్పడ్డ సంస్థ స్పేస్ కిడ్స్ ఇండియా. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఉపగ్రహం ప్యానెల్‌పైనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని, పేరును చెక్కారు. భగవద్గీత ఈ-కాపీ(ఎస్‌డీ కార్డు)నూ పొందుపరిచారు. మొత్తం 25 వేల మంది పేర్లను చెక్కినట్టు సమాచారం. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలోనూ ప్రైవేటు భాగస్వామ్యానికి మొగ్గుచూపుతున్నది. ఇందులో భాగంగానే ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చెందిన ఉపగ్రహాలను రోదసిలోకి పంపడానికి ఆసక్తి చూపిస్తున్నది. స్పేస్ ఎక్స్, ప్లానెట్ ల్యాబ్ తరహా భారత అంతరిక్ష రంగంలో ఉన్నతస్థాయికి చేరుతుందనే ఆశలు పెంచిన పిక్సెల్ ఇండియా శాటిలైట్ ఆనంద్ ఈ ప్రయోగం నుంచి సాంకేతిక సమస్యల కారణాలతో తప్పుకుంది.
‘కమర్షియల్’ సక్సెస్‌పై ఇస్రో, ఎన్‌ఎస్ఐఎల్‌కు ప్రధాని శుభాకాంక్షలు
పీఎస్ఎల్వీ-సీ51ను విజయవంతంగా ప్రయోగించి కమర్షియల్ లాంచ్‌ను సక్సెస్ చేశారని, ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సంస్కరణలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. నాలుగు చిన్న ఉపగ్రహాలు భారత యువత ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని ట్వీట్ చేశారు. అమేజోనియా-1 విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై బ్రెజిల్ ప్రభుత్వానికి, శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి అభినందించారు. అమెజాన్ అడవుల నరికివేత, వ్యవసాయానికి సంబంధించి భూ పరిశీలనకు ఈ ఉపగ్రహం సేవలందించనుంది.