కాళ్లు మొక్కితే మంత్రి పదవి.. అల్లోలపై ఏలేటి సంచలన ఆరోపణలు

by Anukaran |
కాళ్లు మొక్కితే మంత్రి పదవి.. అల్లోలపై ఏలేటి సంచలన ఆరోపణలు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేని మంత్రి పదవి దేనికోసమని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పదవుల కోసం తనకంటే చిన్నవారైన సీఎం కేసీఆర్, హరీశ్‌రావుల కాళ్లు ఇంద్రకరణ్ రెడ్డి పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పదవి వచ్చిన తర్వాత మంత్రిగా జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఏలేటి అల్లోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదేనా అభివృద్ధి అంటే..

‘జిల్లా కేంద్రంలో డివైడర్లు కట్టించి, సెంట్రల్‌ లైటింగ్‌ పెట్టించడమే అభివృద్ధా.. ఇదే జిల్లా కేంద్రంలో గాజుల్‌పేట్‌ రోడ్డు ఎట్లున్నది.. గ్రామాల్లో రోడ్లు ఎట్లున్నయ్‌.. ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు.. భూకబ్జాలు, కంకర మిషన్ల కోసమే మంత్రి అయ్యారా.. మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది..’ అంటూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు.. ఇటీవల చిన్నపాటి వర్షానికే నిర్మల్‌ జలమయం అయ్యిందన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారమైతే.. విపక్షాలే చేయించాయని మంత్రి ఆరోపించారన్నారు. జిల్లా కేంద్రంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఏళ్లు గడస్తున్నా ఎందుకు కట్టించడం లేదని ప్రశ్నించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోతే త్వరలోనే మంత్రి ఇంటిని ముట్టడి చేస్తామన్నారు. కేవలం జిల్లా కేంద్రంలో డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్, ఫుట్‌పాత్‌లను కట్టించగానే అభివద్ధి జరిగినట్లా.. అని నిలదీశారు. తనతో వస్తే ఇదే జిల్లా కేంద్రంతో పాటు పల్లెల్లో ఎలాంటి కష్టాలు ఉన్నాయో.. అభివద్ధి తీరు ఎలా ఉందో చూపిస్తానని మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.

ఆ మంత్రిని తీసేశారు.. మరి ఈయన..

మంత్రి కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు ఏలేటి. వీరికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అధికారులు తీరు మార్చుకోవాలని.. మంత్రి, ఆయన బంధువుల ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. ఓబీసీ(ఈటల రాజేందర్) మంత్రిని సాగనంపిన కేసీఆర్‌ సర్కారు ఇన్ని ఆరోపణలు ఉన్న అల్లోలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం బలవంతంగా అసైన్డ్‌ భూములను గుంజుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో రూ.60 కోట్లకు ఎకరం అమ్మిన చోటే రూ.30 కోట్లకు ఎలా విక్రయించారని, ఈ తేడా ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్, డీవన్‌ పట్టాలతో దోచుకున్న భూములపై నిజనిర్ధారణ కమిటీ వేసి, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story