వైజాగ్‌లో ఆ మూడు ప్రాంతాలే హై రిస్క్ జోన్‌లు: ఆళ్ల నాని

by srinivas |
వైజాగ్‌లో ఆ మూడు ప్రాంతాలే హై రిస్క్ జోన్‌లు: ఆళ్ల నాని
X

ప్రజలకు ఎన్ని పనులున్నా ఇళ్లలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. వైజాగ్‌లో సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించామని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు అధికంగా ఉన్న ప్రాంతాల నేపథ్యంలోనే ఆ మూడు ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించామని అన్నారు. అలాగని ఆ మూడు ప్రాంతాల్లో ఉన్నవారందరికీ కరోనా ముప్పు ఉన్నట్టు కాదని ఆయన తెలిపారు.

కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఇంకా కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తే కరోనా దూరమవుతుందని, లేని పక్షంలో పెను ప్రమాదం తప్పదని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణకు 20 కమిటీలు నియమించామని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 1470 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు.

ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నివారణకు నిధులు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగానే లాక్‌డౌన్ చేపట్టామని చెప్పారు. రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యం పంపిణీ చెయ్యడంతో పాటు ఖర్చుల కోసం వెయ్యి రూపాయలు అందజేయనున్నామని తెలిపారు.

Tgas: alla nani, visakhapatnam, corona, high risk zone, covid-19

Advertisement

Next Story

Most Viewed