ఇంతకూ తెలంగాణలో కరోనా చావులు ఎన్ని?

by Anukaran |   ( Updated:2020-07-27 00:36:57.0  )
ఇంతకూ తెలంగాణలో కరోనా చావులు ఎన్ని?
X

“రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉంది. మిగిలిన నగరాలు, రాష్ట్రాలతో పోలిస్తే ఆందోళనకరంగా లేదు” వైద్యారోగ్య మంత్రి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పదేపదే చెబుతున్న మాటలివి. ఇపుడు వాటి చుట్టే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటిన్లలోని లెక్కలు కరోనా మృతుల సంఖ్య కరక్టేనా? అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అంకెలకు, కాలుతున్న శవాల సంఖ్యకూ పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా సోకి మరణించినవారి సంఖ్య 463. ఒక్క ఎర్రగడ్డ శ్మశానవాటికలోనే ఇప్పటివరకు కాలిన కరోనా మృతదేహాల సంఖ్య 1,042. జూన్ 22 నాటికి 156 శవాలు కాలితే, ఈ నెల రోజుల వ్యవధిలో మరో 900కు పైగా కాలాయి. ఈ అంకెలు ఏం చెప్తున్నాయి? ఒక్క ఎర్రగడ్డ శ్మశానానికే ఇన్ని శవాలు వస్తే నగరంలోని, రాష్ట్రంలోని మిగతా శ్మశానవాటికలకు ఎన్ని వచ్చి ఉంటాయి? అసలేం జరుగుతోంది? ప్రభుత్వం దాపరికంతో ఎందుకు వ్యవహరిస్తోంది?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా మృతుల సంఖ్య గందరగోళంగా మారుతోంది. వాస్తవానికీ, గణాంకాలకూ లంకె కుదరడం లేదు. ఎర్రగడ్డ శ్మశానానికి జూన్ నెల చివరి వరకూ రోజుకు సగటున 20 లోపే కరోనా మృత దేహాలు వచ్చేవి. జూలై మొదటి వారం నుంచి రోజుకు సగటున 35 పైనే వస్తున్నాయి. వీటి వివరాలు నమోదు చేయడానికి ఓ రిజిస్టర్‌ను మెయింటెన్ చేస్తున్నారు. దీని ప్రకారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో మే 24 నుంచి జూలై 25 వరకు 1,042 కరోనా శవాలను దహనం చేశారు. కరోనా మృతుల సంఖ్య 463 మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది. నగరంలోని వివిధ శ్మశానవా టికల్లో, మిగిలిన 30 జిల్లాల్లోని శ్మశానవాటికల్లో రోజూ ఎన్ని కరోనా శవాలు కాలుతున్నాయో తెలియదు. ప్రభుత్వం ఎలాగూ అధికారికంగా చెప్పదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని చెప్పనీయదు. ఆసుపత్రిలో చేరింది మొదలు శవమైన తర్వాత దహనం చేసే వరకు అంతా గోప్యమే. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా కారణంగా చనిపోయినవారి మృతదేహాలను మాత్రమే ఈ శ్మశానానికి తీసుకొస్తున్నట్లు కేర్ టేకర్‌ ‘దిశ’ ప్రతినిధికి తెలిపారు. సహజ మరణం పొందినవారి మృతదేహాలకు వేరే బర్నింగ్ ప్లాట్‌ఫారాలు ఉన్నాయని, కరోనా మృతదేహాలకు మాత్రం విడిగా స్థలాన్ని కేటాయించామని అన్నారు. మొదట్లో కొన్ని మాత్రమే బర్నింగ్ ప్లాట్‌ఫారాలు ఉండేవి. శవాల సంఖ్య పెరిగిపోవడంతో అదనంగా కట్టాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.

భయపడుతున్న సిబ్బంది

ఎర్రగడ్డ శ్మశానవాటికు కరోనా మృతదేహాలను పంపడం మే నెల 24వ తేదీ నుంచి మొదలైంది. జూలై 25వ తేదీ రాత్రి నాటికి రెండు నెలల్లో మొత్తం 1,042 కరోనా మృతదేహాలను కాల్చినట్లు అక్కడి రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. మృతదేహాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో చనిపోయిన పేషెంట్లవే. హిందువులకు చెందిన శవాలు మాత్రమే ఇక్కడకు వస్తుంటాయి. ముస్లిం పేషెంట్ల శవాలు పహాడీషరీఫ్, హఫీజ్‌పేట్, మల్లాపూర్ లాంటి కబర్‌స్థాన్‌లకు వెళ్తాయి. ఏ ఆసుపత్రి నుంచి శవం వచ్చిందో, రోజుకు ఎన్ని వస్తున్నాయో, ఎవరు దహనం చేస్తున్నారో, ఏ సంస్థ ఈ శవాలను ఆసుపత్రుల నుంచి ఇక్కడకు తీసుకొచ్చిందో, ఇప్పటివరకు ఎన్ని కాల్చారో ఇలాంటి వివరాలేవీ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పడం లేదు. “మేం బతుకుతెరువు కోసం కాంట్రాక్టు సంస్థ ద్వారా ఇక్కడ పని చేస్తున్నాం. భార్యా పిల్లలతో అద్దె ఇండ్లలో ఉంటున్నాం. మేం ఈ పని చేస్తున్నామని తెలిస్తే ఆ ఇండ్లలో ఉండలేం. మా ముఖాలు కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాం. మా వివరాలు మీడియాలో వస్తే మా బతుకులను ఆగం చేసినట్లే. ఉన్న ఉద్యోగం, ఉపాధి పోవడంతో కుటుంబాన్ని పోషించుకోడానికి ఈ పనిలో కుదిరాం. ఇప్పుడు ఇది కూడా పోతే రోడ్డున పడతాం” అని ఓ ఉద్యోగి వాపోయాడు. శ్మశానవాటిక నిర్వహణను ఒక కేర్ టేకర్ ద్వారా జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తుంది. వివరాలను వెల్లడించడానికి మాత్రం ఆయన సాహసించ లేదు. “ఈ పనిని ఇద్దరమే చేస్తున్నాం. మీడియాకు పొక్కితే మా ఇద్దరి ఉద్యోగం ఊడిపోతుంది. వివరాలను బయటకు పొక్కనీ యవద్దు అని ముందుగానే మాకు ఆదేశాలు ఇచ్చారు. మా బతుకుల్లో నిప్పులు పోయొద్దనుకుంటే వివరాలను అడగొద్దు ప్లీజ్” అంటూ నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ఉదయం నుంచే అంబులెన్సుల హడావుడి

కరోనా మృతదేహాలు పూర్తిగా సీల్ చేసి వస్తుంటాయి. బంధువులు వస్తే దూరం నుంచే చూపిస్తారు. అంబులెన్సుతోపాటు పీపీఈ కిట్లు ధరించిన ఆసుపత్రి/జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా వస్తారు. కొన్నిసార్లు మృతుల బంధువులు కూడా పీపీఈ కిట్లతోనే వస్తారు. ఒకరు రికార్డు రూమ్ దగ్గరకు వెళ్లి ఏ ఆసుపత్రి నుంచి శవాన్ని తీసుకొచ్చామో ఆంబులెన్స్ నెంబర్, ఆసుపత్రి పేరు, సమయం, మృతుని పేరు, చిరునామా తదితరాలన్నింటినీ రిజిస్టర్‌లో నమోదు చేయిస్తారు. మరో ఇద్దరు శవాన్ని దహనం కోసం ఆంబులెన్స్ నుంచి కిందకు దించి బర్నింగ్ బెడ్ (ప్లాట్‌ఫారం) దగ్గరకు చేరుస్తారు. అక్కడితో వారి పని అయిపోతుంది. అంబులెన్స్ వెళ్లిపోతుంది. వారు విడిచేసిన పీపీఈ కిట్లు కుప్పగా పేరుకుపోయాయి. శవాలను కాల్చడానికి షెడ్డు కింద నాలుగు బెడ్‌లు ఉన్నప్పటికీ అవి సరిపోవడంలేదు. దీంతో ఓపెన్ ప్లేస్‌లో తాత్కాలిక బెడ్‌లను ఏర్పాటు చేశారు. వానలు కురుస్తున్నందున ఒక ఫ్యాబ్రికేటెడ్ షెడ్ వేసి, అందులో మరో నాలుగు బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిప్టుల్లో పని చేయడానికి 13 మందిని ఆ ఏజెన్సీ నియమించుకుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రికార్డు రూమ్, బర్నింగ్ షెడ్ కట్టే సమయంలో అర్ధరాత్రి వరకూ శవాలను కాల్చినట్లు సిబ్బందిలో ఒకరు తెలిపారు.

పీపీఈ కిట్లు లేకుండానే దహన క్రియలు

శవాలు కాల్చడానికి ఒక్కొక్కరికి రోజుకు రెండు వేల రూపాయలు చెల్లిస్తున్నారు. వీరిలో ఎవ్వరికీ పీపీఈ కిట్లు లేవు. నాసిరకం మాస్కును మాత్రం కట్టుకుంటారు. చేతులకు గ్లవుజులు కూడా ఉండవు. శవాన్ని కాల్చేటపుడు మంటలు అంటుకుంటాయన్న భయంతో వారు పీపీఈ కిట్లను, గ్లవుజులను వాడడం లేదు. మామూలుగా ఒక్కో శవానికి నాలుగు క్వింటాళ్ల కట్టెలు సరిపోతాయి. కరోనా మృతదేహాలకు ఎనిమిది క్వింటాళ్లు వాడుతున్నారు. ప్రతీ శవానికి ఒక నెంబర్ ఉంటుంది. అస్థికల కోసం బంధువులు వస్తారు కాబట్టి, వాటిని ఒక కొత్త కుండలో మేమే తీసిపెట్టి దానికి గుడ్డకట్టి నెంబర్ వేస్తాం. ఎవరైనా వచ్చి అడిగితే ఇస్తాం” అని తెలిపారు. నెలన్నర రోజులుగా ఈ పని చేస్తూనే ఉండడంతో వారిలో స్వీయ రక్షణ తీసుకోవాలనే స్పృహ కూడా లేకుండా పోయింది. షెడ్డు పక్కన పీపీఈ కిట్లు పేరుకుపోయాయి. దీన్ని చిత్రీకరిస్తున్న విషయం తెలుసుకుని ఒకరు అప్పటికప్పుడు వాటికి నిప్పు పెట్టారు. ఎటు చూసినా వాడిపారేసిన మాస్కులు వందల సంఖ్యలో రోడ్లపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

టన్నుల కొద్దీ కట్టెలు

జూన్ నెలలో రోజుకు సగటున 20 లోపే శవాలు వచ్చేవని, నెల నుంచి రోజుకు దాదాపు 40 దాకా వస్తున్నాయని, దీంతో కట్టెలను కూడా తెప్పించుకోవడం పెరిగిందని కేర్ టేకర్ తెలిపారు. వర్షాలకు వాటిని తడవకుండా కాపాడుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. విద్యుత్ దహనవాటిక వారం రోజుల నుంచే పనిచేస్తోందని, ఒక్క శవాన్ని కాల్చడానికి రెండు గంటలు పట్టినా ఆ తర్వాత అస్థికలు తీయడానికి చల్లారే వరకు ఆగాల్సి వస్తోందని, రోజుకు రెండు కంటే ఎక్కువ శవాలను కాల్చలేమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు ద్వారా కట్టెలను కిలో పది రూపాయల చొప్పున కొంటున్నామని, ఒక్కో శవాన్ని కాల్చడానికి సుమారు ఎనిమిది వేల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఇక డీజిల్, కిరోసిన్, ఇతర అవసరాలన్నీ కలిపి పది వేల రూపాయలవుతుందన్నారు. గ్యాస్ ఛాంబర్‌లో కాల్చడానికి కొత్త మిషన్‌ను తెచ్చినా దాని డెమో చూసిన తర్వాత అధికారులకు సంతృప్తి కలగకపోవడంతో ఇంకా దాన్ని ముట్టుకోలేదు.

Advertisement

Next Story