- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇళ్లకే పరిమితమైన వరంగల్ జిల్లా వాసులు
దిశ, వరంగల్: కరోనా.. కరోనా… ఇప్పుడు ప్రపంచం అంతటా మార్మోగుతున్న పదం. కరోనా వైరస్ (కోవిడ్-19) అనే మాట వింటేనే జనం ఉలిక్కి పడుతున్నారు. ఇక ఎవరైనా పదే పదే తుమ్మినా, దగ్గినా పక్కన ఉన్న వాళ్లు అనుమానంగా చూస్తున్నారు. ఈ భయంతో వరంగల్ జిల్లా వాసులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా వ్యాప్తి నివారణకు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. పరీక్షలు కూడా వాయిదా వేసింది. జనసమ్మర్థం ఉండే సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు, ఫంక్షన్ హాల్స్ మూసేశారు. దీనికితోడు పలు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ ఇళ్లల్లోనే(జనతా కర్ఫ్యూ) ఉండాలని కేంద్రం సూచించింది.
కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఏ ఒక్కరికీ నిర్ధారణ కాలేదు. రెండ్రోజుల కిందట జనగామ జిల్లాకు చెందిన ఏడుగురు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చారనీ, వారిని హైదరాబాద్ లోని క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్లు తెలుస్తోంది. వరంగల్ సమీపంలోని ఆరెపల్లికి చెందిన వ్యక్తి విదేశాలనుంచి రాగా వైద్యులు అతడి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించారు. తాజాగా కరోనా లక్షణాలున్న వ్యక్తి హైదరాబాద్ నుంచి డోర్నకల్‌కు వెళ్తుండగా గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసులు మార్గమధ్యలో ఆలేరు రైల్వే స్టేషన్‌లో దించేసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరిని కాజీపేట రైల్వే స్టేషన్లో దించేయగా రైల్వే పోలీసులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కరోనా నివారణకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు, పోలీస్ అధికారులు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేసింది.
జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లు..
అధికారులు జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని కేఎంసీలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైరాలజీ ల్యాబ్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ గ్రేటర్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది కరోనా నివారణకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సైతం కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకలు రద్దు చేసుకుంటున్నారు.
tags : warangal, corona virus, kazipet, officers