అన్నీ మల్టీజోనల్ ​పోస్టులే.. స్టేట్​కేడర్ పోస్టు ఎత్తివేత

by Anukaran |   ( Updated:2021-08-06 23:05:05.0  )
Telangana Jobs
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వివిధ శాఖల్లోని పోస్టులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరిల వారీగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ విభజన చేసింది. ఏ పోస్ట్ ఏ కేటగిరి కిందకు వస్తుందో క్యాడర్‌ని విభజిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మిగతా పోస్టులు జోనల్, మల్టీ జోనల్ పోస్టులు పేర్కొంటూ 84 జీవోను జారీ చేసింది ప్రభుత్వం. కొన్ని లోకల్ క్యాడర్ పోస్టులు, జోనల్ పోస్ట్‌లుగా మార్పు చేశారు. స్టేట్ క్యాడర్ పోస్టులు మల్టిజోనల్ పోస్టులుగా మార్చారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయం, క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల కేటాయింపు, కొత్త పోస్టుల మంజూరు ఉంటుందని ప్రభుత్వం జీవోల్లో పేర్కొంది. ఆ తర్వాత ఖాళీలపై స్పష్టత రానుంది. మొత్తం 87 విభాగాధిప‌తుల‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోస్టుల కేడ‌ర్ వ‌ర్గీక‌ర‌ణ‌ను ఖ‌రారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేష్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్పెక్టర్లు మల్టీజోన్లలో ఎక్కడ పోస్టింగ్‌ ఇస్తే అక్కడ పని చేయాల్సి ఉంటుంది. ఇన్ స్పెక్టర్​ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్ పోలీస్​ పోస్టులను మల్టీజోన్​ కేడర్‌కు తీసుకువచ్చారు.

ఇక స్టేట్​కేడర్ గాయబ్​

రాష్ట్రంలో డైరెక్ట్​ రిక్రూట్‌మెంట్‌లో స్టేట్​ కేడర్ ​పోస్టును తొలగించారు. దీంతో గ్రూప్​–1 స్థాయి అధికారులు కూడా మల్టీజోన్‌కే పరిమితం కానున్నారు. గతంలో డీఎస్పీ, ఆర్టీఓ, ఆర్డీవో వంటి పోస్టులు స్టేట్ ​కేడర్‌లో ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వారిని ఎక్కడికైనా బదిలీ చేసే అవకాశం ఉంది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం వీరంతా మల్టీజోన్‌లోనే ఉండాల్సి ఉంటోంది. ప్రస్తుతం ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా ఉన్నాయి. ఈ సందర్భంగా జోన్ల పరిధిలో జనాభా సైతం తేల్చారు. కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా) భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు, బాసర జోన్ (39.74 లక్షల జనాభా) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి.

రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా) కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా) కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు, యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా) సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు, చార్మినార్ జోన్ (1.03 కోట్ల జనాభా) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు, జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా) మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉండగా… రెండు మల్టీ జోన్లు కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)తో, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)తో ఉన్నట్లు స్పష్టం చేశారు.

మల్టీజోన్​ కేడర్​

ఆర్డీవో, అసిస్టెంట్ ​సెక్రెటరీ, సూపరింటెండెంట్, తహశీల్దార్, ఇన్ స్పక్టర్ ఆఫ్ సర్వే (యూఎల్​సీ), డిస్ట్రిక్​ రిజిస్టార్, అసిస్టెంట్ ఇన్ స్పక్టర్ జనరల్, గ్రేడ్​ –1 సబ్​రిజిస్టార్, అసిస్టెంట్ ​డైరెక్టర్​ సర్వే ల్యాండ్స్​ రికార్డు, ఇన్ స్పక్టర్ ఆఫ్ ​సర్వే, అసిస్టెంట్ ఎగ్జిగ్యూటివ్ ​ఇన్​ఫర్​మేషన్ ​ఇంజినీర్, పబ్లిక్ ​రిలేషన్​ ఆఫీసర్, అసిస్టెంట్​ప్రాజెక్టు ఆఫీసర్, అసిస్టెంట్​ ఇన్​ఫర్​మేషన్ ​ఇంజినీర్, అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్​డైరెక్టర్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్, కార్పొరేట్​ సబ్​రిజిస్టార్ ​వంటి పోస్టులన్నీ మల్టీజోన్​ కేడర్‌కు కేటాయించారు. పంచాయతీరాజ్‌లో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శిని జోనల్ ​పరిధికి తీసుకువచ్చారు. గ్రేడ్​–1తో పాటుగా గ్రేడ్–2, గ్రేడ్​–3, శానిటరీ ఇన్ స్పక్టర్ గ్రేడ్​ –2, పంచాయతీ లైన్​మెన్, ఫిట్టర్‌ను జోనల్‌కు తీసుకువచ్చారు. మల్టీజోన్ ​పరిధిలోకి అకౌంట్ ​ఆఫీసర్స్, జిల్లా పంచాయతీ అధికారి, మండల ఇంజినీరింగ్​ అధికారి (ఎంఈవో), డివిజనల్ ​పంచాయతీ అధికారి, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ ఎంపీఓలను చేర్చారు. అన్ని శాఖల్లో ఇలాంటి పోస్టులన్నీ మల్టీజోన్​లోకి రానున్నాయి. కాగా జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులన్నీ 95 శాతం స్థానికత 5 శాతం స్థానికేతరులకు కేటాయించినట్లు మరోసారి వెల్లడించారు.

సర్దుబాటు ఎప్పుడో..?

జోన్ల వర్గీకరణ పూర్తి కావడంతో ఇక ఉద్యోగుల సర్దుబాటుపై దృష్టి పెట్టాల్సి ఉంటోంది. ఉద్యోగుల సర్దుబాటు తర్వాత సదరు పోస్టుల ప్రకారం, పని చేస్తున్న ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లను ఖరారు చేసి ట్రెజరీలకు వివరాలు చేరాల్సి ఉంటోంది. అంతకుముందు సర్దుబాటుకు ఐఏఎస్‌లతో కమిటీ వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే ఖాళీల భర్తీ ఉండనున్నట్లు అధికారులు చెప్పుతున్నారు.

Advertisement

Next Story