చేనేతను మనమే కాపాడుకోవాలి : శ్రీనివాస్ గౌడ్ 

by Shyam |
చేనేతను మనమే కాపాడుకోవాలి : శ్రీనివాస్ గౌడ్ 
X

దిశప్రతినిది, మహబూబ్ నగర్ :
చేనేత పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న మహబూబ్ నగర్ ఎక్స్పో ప్లాజాలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. గతంలో చేనేత పరిశ్రమకు మంచి పేరు ఉండేదని, అగ్గిపెట్టెలో సైతం పట్టేలా చీరలను నేసిన చేనేత కార్మికులు ఎంతో గొప్పవారని గుర్తు చేశారు. రానురాను చేనేతకు ఆదరణ తగ్గిందని ,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చేనేతను, చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి సోమవారం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించేలా ఉత్తర్వులు జారీచేసి ఆ రంగానికి మళ్ళీ జీవం పోసిందని గుర్తుచేశారు. వృత్తి కలలను ప్రోత్సహించి ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కులవృత్తులను సజీవంగా నిలపాలని కోరారు. ప్రత్యేకించి జిల్లాలోని ఎక్స్ పో ప్లాజాలో చేనేత, హస్తకళల ఉత్పత్తులు పెద్ద ఎత్తున ప్రదర్శన, అమ్మకానికి ఉంచాలని, పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారు సైతం ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని, కరోనాతో పోరాటం చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్‌ లను కలిపి జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సోమవారం విన్నవించినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించారని వివరించారు.

జిల్లాలో త్వరలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభిస్తామని, మంత్రి కేటీఆర్ ఐటీ ఇండస్ట్రినీ ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు , మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డీసీసీబీ బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు గోవిందప్ప, మున్సిపల్ కౌన్సిలర్లు పాషా, నరసింహులు, మహబూబ్ అలీ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed