‘విమానాలకు హైడ్రోజన్ ఆధారం’

by Harish |
‘విమానాలకు హైడ్రోజన్ ఆధారం’
X

దిశ, వెబ్‌డెస్క్: 2035 నాటికి ఉద్గార రహిత విమానాలను తీసుకొచ్చే ప్రణాళికలో భాగంగా ఎయిర్‌బస్ సంస్థ హైడ్రోజన్ ఆధారంగా నడిచే విమానాలను తయారు చేసేందుకు పరిశోధనలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో 200 మంది ప్రయాణించడానికి వీలుగా 2000 నాటికల్ మైళ్ల దూరం వెళ్లగలిగే విమానం డిజైన్‌లను సంస్థ సిద్ధం చేసింది. ఇందులో ఉపయోగించే గ్యాస్ టర్బైన్ ఇంజన్‌ను హైడ్రోజన్ ఆధారంగా పనిచేసేలా మార్పులు చేశారు. ఇదే ఇంజన్‌తో ఉన్న మొత్తం మూడు డిజైన్‌లను సిద్ధం చేసినట్టు కంపెనీ వెల్లడించింది.

మొత్తం 200 మంది ప్రయాణీకులు పట్టేలా ఏ321 విమానాలను నూతన ఇంజిన్లతో 2000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించడానికి వీలుగా ఈ డిజైన్‌లను తయారు చేశామని కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ విమానంతో పాటు ప్రొపెల్లర్ విమానా డిజైన్‌ను కూడా సిద్ధం చేసినట్టు, ఇందులో 100 మంది ప్రయాణించడానికి ఏర్పాట్లు చేశారు. ఇది తక్కువ దూరం ప్రయాణించే వారికి సరైన ఎంపికగా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

వీటి డిజైన్‌లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అయితే, ఇవికాకుండా కొత్త కాన్సెప్ట్ విమానాలపై కూడా పరిశోధకులు పరిశీలిస్తున్నారని, ప్రస్తుతం తరం జెట్‌లతో పోలిస్తే ఇంధన వినియోగాన్ని 20 శాతం తగ్గిస్తాయని చెబుతున్నారు. 2035 నాటికి మొదటి ఉద్గార రహిత విమానాన్ని సిద్ధం చేసేందుకు కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఈ పరిశోధనకు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా సాయమందిస్తోంది.

Advertisement

Next Story