తెలంగాణ ప్రాజెక్టుల్లో సీఎం జగన్, కేసీఆర్‌కు వాటా..? : మధుయాష్కీ

by Shyam |
తెలంగాణ ప్రాజెక్టుల్లో సీఎం జగన్, కేసీఆర్‌కు వాటా..? : మధుయాష్కీ
X

దిశ, అమనగల్లు : రాష్ర్టంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌తో కారు జంగ్ ఖాయమని.. సైరన్ సౌండ్‌కు సీఎం కేసీఆర్ ఖంగు తింటున్నారని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆమనగల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఖంగు తిన్న కేసీఆర్ అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేయకుండా పోలీసులతో అడ్డుకున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్షతో తెలంగాణ రాష్ర్టం ఏర్పడలేదని, అమరుల త్యాగం, సబ్బండ జాతుల పోరాటంతోనే ప్రత్యేక రాష్ర్టం సిద్దించిందని ఆయన చెప్పారు.

ప్రత్యేక రాష్ర్టంలో విద్యార్థులు, యువత చదువుకుని అభివృద్ధి చెందితే ఎక్కడ తాము అధికారానికి దూరమవుతామని రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీలలో పోస్టులను ఖాళీగా ఉంచి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. అదే బాటలో దేశంలోని ఏడేళ్ళ పాలనలో మోదీ కేసీఆర్‌తో జతకట్టి అన్ని వర్గాలను ప్రధానంగా నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. రాష్ర్టంలోని పేదలకు బర్రెలు, గొర్రెలు ఇచ్చి విద్యార్థులు, యువత అభివృద్ధి మరిచి గల్లీకో వైన్ షాప్‌ను ఏర్పాటుచేసి పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.

సమైక్య రాష్ర్టంలో ఆంధ్రా వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పిన సీఎం ఇప్పుడు తెలంగాణలోని ప్రాజెక్టులను వారికి కాంట్రాక్ట్ ఇచ్చి సీఎం జగన్, కేసీఆర్ పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గులాబీ పార్టీ నాయకులు గులాములుగా మారారని బంగారు తెలంగాణలో బతుకు దెరువు లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, విద్యార్థులకు సంపూర్ణ విద్య అందించేందుకు ఈనెల 12న అఖిల పక్షం ఆధ్వర్యంలో భూత్పూర్ చౌరస్తాలో నిరుద్యోగ జంగ్ సైరన్ సభను నిర్వహిస్తున్నామని, సభకు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, రాష్ర్ట నాయకులు భావనారెడ్డి, బహుజన నాయకులు వస్పుల జంగయ్య, దశరథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed