హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ

by Sumithra |
Telangana High Court
X

దిశ, క్రైమ్‌బ్యూరో: అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కార్పొరేట్ భవనం విలువను రూ.26 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గించడం వల్ల డిపాజిటర్లకు అన్యాయం జరుగుతోందని న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. అత్యంత విలువైన భవనాన్ని బ్యాంకులు తక్కువ ధరకు విక్రయించడంపై పిటిషనర్ ఆండాళ్ రమేష్ బాబు తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అగ్రిగోల్డ్ కార్పొరేట్ కార్యాలయం వేలం పాటకు ఆమోదానికి దాఖలైన దరఖాస్తును తెలంగాణ హైకోర్టు మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పిటిషనర్ ఆండాళ్ రమేష్ బాబు తరుపు న్యాయవాది మాట్లాడుతూ బకాయిలు ఎగవేసిన వారిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించడంతో పాటు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు క్రిమినల్ కేసు నమోదు చేయించాల్సి ఉందన్నారు. కొనుగోలుదారుల డబ్బుతో కొన్న ఆస్తులను అమ్మి, అప్పు జమ చేసుకోవడానికి వీలులేదని, బ్యాంకుల డబ్బు మళ్లించి కొన్న ఆస్తులను అమ్ముకుని రికవరీ చేయాలని ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అగ్రిగోల్డ్ విషయంలోనూ వర్తింపజేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాది వివరించారు.

గతంలో బ్యాంకులు వేలం వేసుకునేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చెయ్యకుండా ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరైంది కాదని హైకోర్టు బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే వేసిన ఆంధ్రా బ్యాంకు బహిరంగ వేలం రద్దు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed