వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-08-10 11:16:30.0  )
Cabinet Sub-Committee
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయరంగంపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్, జగదీశ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ రంగం అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నందున రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాల్సిన అవసరముందున్నారు. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని కోరారు. యాసంగిలో వేరుశనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలన్నారు. తెలంగాణలో ఆప్లాటాక్సిన్ రహిత వేరుశనగకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందన్నారు. నూతన వేరుశనగ వంగడాలను కనుగొనేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ప్రోత్సహిస్తామని చెప్పారు. వరి ధాన్యం నుండి ఇథనాల్‌గా మార్చే పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలన్నారు. స్థానికంగా విత్తన లభ్యత ఉంటే ఆలుగడ్డ సాగును తెలంగాణలో విస్తృతంగా పెంచుకోవచ్చువని తెలిపారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సంక్షోభం నుండి సంవృద్ది వైపు వ్యవసాయ రంగం పరుగులు పెట్టడం సంతోషించదగిన విషయమన్నారు. హరిహారంతో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలయిందన్నారు. రెండు కోట్ల పైచిలుకు జనాభా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయరంగం నుండి ఉపాధి పొందుతున్నందున వ్యవసాయరంగాన్ని లాభసాటి రంగంగా మార్చాలని సూచించారు. 32 జిల్లాల్లో 50 నుండి 100 ఎకరాలలో డెమానిస్ట్రేట్ ఫార్మ్‌ల ఏర్పాటుకు పరిశీలనలు చేపట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరిగేలా డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాల వివరాలను ఉబరైజేషన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలని ప్రత్యామ్నాయ పంటలలో అధిక ఆదాయం చూపించగలిగితే వరి సాగు నుండి రైతులు బయటకు వస్తారని అభిప్రాయపడ్డారు. అవసరాలకు సరిపడా పండ్లు, కూరగాయలు పండించడం లేదని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. సాగునీటి రాక, మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల సాగు తగ్గిందని వాటి మార్కెటింగ్ సమస్యలే దీనికి కారణమయ్యయని వివరించారు. ఆర్గానిక్ సాగు వైపు ప్రోత్సహిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ, సహకార రంగాలు కవలపిల్లల వంటివని అభిప్రాయపడ్డారు. అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను పంటల మార్పిడి వైపు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రైతువేదికల ఏర్పాటు, యువ ఏఈఓలు అందుబాటులో ఉండడం మూలంగా రైతులతో అద్భుతాలు ఆవిష్కరించవచ్చని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed