చెక్​పోస్టులు ఓపెన్​.. ఏఎంసీలకు పెరుగనున్న ఆదాయం

by Shyam |   ( Updated:2021-01-25 01:43:21.0  )
చెక్​పోస్టులు ఓపెన్​.. ఏఎంసీలకు పెరుగనున్న ఆదాయం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్​ చెక్​పోస్టులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాల వల్ల గత ఏడాది జూన్​నుంచి మూతబడిన యార్డులకు పూర్వవైభవం రానుంది. వ్యవసాయయ చట్టాల అమలుపై ఇటీవల సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏఎంసీల పరిధిలో చెక్​పోస్టులను యథావిధిగా నిర్వహించేందుకు మార్కెటింగ్​శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రయోగాత్మకంగా శనివారం చెక్ పోస్టులను ఓపెన్​చేయించిన అధికారులు నేటి నుంచి 24 గంటలుగా తెరిచి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

మార్కెట్​పరిధిలో జరిగే క్రయవిక్రయాలు, రైస్ మిల్లులు, ఇతర ఫుడ్​ప్రాసెసింగ్ యూనిట్లలో జరిగే కొనుగోళ్లపై ప్రభుత్వం ఒక్క శాతం సెస్ వసూలు చేస్తుంది. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని మార్కెట్​యార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తారు. అయితే ఏఎంసీలకు ఫీజు చెల్లించి వస్తువుల రవాణా అవుతున్నది, లేనిది తెలుసుకునేందుకు ప్రతి మార్కెట్​పరిధిలో చెక్ పోస్టులు ఉంటాయి. అక్కడ తనిఖీల్లో ఎగవేత దారులను గుర్తించి వారి నుంచి ఫీజు వసూలు చేస్తుంటారు. అంతర్ రాష్ర్ట సరిహద్దుల చెక్ పోస్టులతో పాటు మార్కెట్ యార్డు పరిధిలో ప్రధాన రహదారులపై ఈ చెక్ పోస్టులు ఉంటాయి.

నూతన చట్టాలతో చెక్​పోస్టుల మూత

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్లో భాగంగా గత ఏడాది జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసింది. దాంతో మార్కెట్​కమిటీల ఆదాయం సగానికి పైగా పడిపోయింది. అలాగే చెక్ పోస్టుల్లో పని చేసే సూపర్ వైజర్లు, సెక్యూరిటీ గార్డులను మార్కెట్​కమిటీలకు ఆటాచ్ చేశారు. యార్డులకు వచ్చిన పంట ఉత్పత్తులకు సంబంధించిన మాత్రమే అధికారులు ఫీజు వసూలు చేశారు. అగ్రి చట్టాలతో చెక్​పోస్టులను ఎత్తివేయడం వల్ల రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల్లో కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఫీజులను మార్కెటింగ్ శాఖ కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఏఎంసీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసినా, పదవుల భర్తీకి ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆదాయం లేకపోవడమేననే ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో 17 యార్డులు

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 17 మార్కెట్ యార్డులు ఉన్నాయి. నిజామాబాద్ లో 7, కామారెడ్డిలో 10 ఉండగా, ప్రతి మార్కెట్​యార్డుల పరిధిలో రాష్ర్ట, జిల్లా, ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సాలురా, కామారెడ్డి జిల్లా సలబత్ పూర్ వద్ద అంతర్ రాష్ర్ట సరిహద్దు వద్ద రెండు ప్రధాన వ్యవసాయ చెక్ పోస్టులు ఉన్నాయి. ఒక్క నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్​పోస్టు ప్రధాన ఆదాయం రూ. 10 కోట్లు కాగా, అవి మూతపడినప్పుడు కేవలం 30 శాతం మాత్రమే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే తొలగించే వరకైనా ఆదాయాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉన్నఫలంగా చెక్ పోస్టులను తెరిపించింది. కనీసం ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని కేంద్రం చెబుతున్న సమయంలో రాష్ర్ట ప్రభుత్వం చెక్ పోస్టులను యథావిధంగా నిర్వహిస్తూ ఆదాయాన్ని రాబట్టేందుకు సంకల్పించింది. కేంద్రం నిర్ణయం వరకూ చెక్ పోస్టులను ఓపెన్ చేసి తనిఖీలు చేయాలని మార్కెట్​కమిటీలు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed