బ్లాక్‌ ఫంగస్‌తో.. అవాస్కులర్ నెక్రోసిస్

by Harish |
బ్లాక్‌ ఫంగస్‌తో.. అవాస్కులర్ నెక్రోసిస్
X

దిశ, ఫీచర్స్ : ఒకవైపు కరోనాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌ల దాడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా, కొందరిలో ‘లాంగ్ కొవిడ్’ కలవరపెడుతోంది. అలానే బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడ్డ ఆ తర్వాత దాని ప్రభావం పేషెంట్‌పై ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఫంగస్ దాడితో బాధితుల జీవ క్రియల్లో మార్పులతో పాటు, అవాస్కులర్ నెక్రోసిస్(ఏవీఎన్)‌ బారినపడుతున్నట్లు వెల్లడైంది.

కొవిడ్‌ బారిన పడినవారు ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) తీవ్రరూపం దాల్చుతోందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లో కోవిడ్ 19 చికిత్స పొందిన 40 ఏళ్లలోపు ముగ్గురు యువకులకు 2 నెలల తర్వాత అవాస్కులర్ నెక్రోసిస్ సోకింది. ఈ క్రమంలోనే హిందూజా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ అగర్వాల్ దీనిపై ఓ రీసెర్చ్ అనాలసిస్‌ తాజాగా విడుదల చేశారు. ప్రతిష్టాత్మక వైద్య పత్రిక ‘బీఎంజే కేస్ స్టడీస్’లో ఇది ప్రచురితమైంది. ఈ స్టడీ ప్రకారం కొవిడ్ అనంతర రోగులలో ఏవీఎన్(శాశ్వత అంగవైకల్యం) వచ్చే అవకాశాలున్నాయి. ఫంగస్ సోకిన శరీర భాగంలో రక్త ప్రవాహం నిలిచిపోయి నెమ్మదిగా ఎముక కరుగుతుంది. దాంతో శాశ్వతంగా అంగవైకల్యం బారినపడతారు. అందువల్లే ఏవీఎన్‌ను శాస్త్రవేత్తలు ‘బోన్ డెత్ ఫంగస్’ అని కూడా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఫంగస్ దాడి జరుపుతుంది. కొవిడ్ సెకెండ్ వేవ్‌ సమయంలో మోతాదుకు మించి స్టెరాయిడ్లను వాడటంతో పాటు, వైరస్ ప్రభావం వల్ల బాధితుల్లో ‘ఇమ్యూనిటీ పవర్’ చాలా వరకు తగ్గిపోతోంది. ఈ కారణంగానే బ్లాక్‌ ఫంగస్‌ దాడి పెరగగా, కొందరిలో ఐరన్‌, జీవక్రియల్లోనూ తేడాలొచ్చాయి. అధ్యయనాల ప్రకారం మ్యూకర్‌ మైకోసిస్‌, అవాస్కులర్ నెక్రోసిస్ రావడానికి స్టెరాయిడ్ల వాడకమే ప్రధాన కారణమని మరోసారి అధ్యయనం తేల్చింది. రాబోయే కొద్ది నెలల్లో ఏవీఎన్ కేసులు ఎక్కువగా పెరిగే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న 264 మంది రోగులలో 30 మందికి ఒక కంటి చూపు కోల్పోయారని ఆసుపత్రి ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. బ్లాగ్ ఫంగస్ ముక్కు, కళ్ళు, సైనసెస్‌తో పాటు కొన్నిసార్లు మెదడును కూడా దెబ్బతీస్తుంది.

Advertisement

Next Story

Most Viewed