కాలనీలో ‘లిటిల్ ఫ్రీ లైబ్రరీ’లు

by Shyam |
కాలనీలో ‘లిటిల్ ఫ్రీ లైబ్రరీ’లు
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే రోజుల్లో ‘గ్రంథాలయాలు’ ఉండేవట అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశాం. ఒకప్పుడు ప్రతి కాలనీలో చిన్నపాటి లైబ్రరీలు ఉండేవి. అది ఇల్లే కావచ్చు. కానీ, ‘లైబ్రరీ’గా పిలిచేవాళ్లు. అందరూ అక్కడికెళ్లి పుస్తకాలు చదువుకునేవారు. ఇప్పుడు లైబ్రరీలు అరుదుగా కనిపిస్తాయి. ఉన్న లైబ్రరీలు కూడా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ట్రెండ్ మారుతున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. ఈ -బుక్స్, ఆడియో-బుక్స్ వచ్చేశాయి. ఆన్‌లైన్ లైబ్రరీలు మొదలయ్యాయి. దాంతో లైబ్రరీ ప్లేస్‌ను ఆన్‌లైన్ లైబ్రరీలు రీప్లేస్ చేశాయి. ఆన్‌లైన్‌లో చదివిన దానికి.. పుస్తకం పట్టుకుని చదివిన దానికి తేడా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే.. యాక్టర్, రైటర్, ఫిల్మ్ మేకర్, ఆథర్, డైరెక్టర్ మానవ్ కౌల్ తమ కాలనీలో కనిపించిన ‘ఫ్రీ లైబ్రరీ’ గురించి ట్వీట్ చేస్తూ.. అలాంటి లైబ్రరీలు అన్ని కాలనీల్లోనూ ఉండాలంటున్నాడు.

మానవ్ కౌల్ కాలనీలో పాప్ కో వారి సౌజన్యంతో..‘లిటిల్ ఫ్రీ లైబ్రరీ’ని ఏర్పాటు చేశారు. ఇది చాలా చిన్న లైబ్రరీ. ఓ చెట్టుకు కూడా దీన్ని అమర్చచ్చు. దీనికంటూ ప్రత్యేకంగా ప్లేస్ వెతకడం. లేదా ఓ షట్టర్ రెంట్ తీసుకోవడం అవసరం లేదు. నాలుగు అరల్లో బుక్స్ అమర్చి ఉంటాయి. ఆ పుస్తకాలన్నింటినీ ఉచితంగా చదవొచ్చు. ‘టేక్ ఏ బుక్ – రిటర్న్ ఏ బుక్’ అనే కాన్పెప్టుతో దీన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఎవరైనా పుస్తకాలు కూడా డోనేట్ చేయొచ్చు. ఒకరు బుక్ తీసుకెళ్లే ముందు.. వారి దగ్గర ఏదైనా బుక్ ఉంటే.. తమ దగ్గరున్న పుస్తకాన్ని అక్కడ పెట్టి.. లైబ్రరీలో నచ్చిన పుస్తకాన్ని తీసుకెళ్లొచ్చు. అయితే, మానవ్ ఈ లైబ్రరీని చూసి..ఇలాంటి చిన్న లైబ్రరీలు ప్రతి కాలనీలో ఉండాలంటూ ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ అయ్యింది.

నటి రిచా చద్దా దీనిపై స్పందిస్తూ..‘నేను చాలా బుక్స్ డోనేట్ చేశాను’ అంటూ మానవ్ ట్వీట్‌ను షేర్ చేసింది. ఇక ప్రముఖ జర్నలిస్ట్ బర్కా దత్ మానవ్ చెప్పిన ఐడియా బాగుందని మెచ్చుకున్నారు. మరికొంత మంది నెటిజన్లు తాము కూడా ఇలాంటి లైబ్రరీ తమ కాలనీల్లో ప్రారంభిస్తామని చెబుతున్నారు. అంతేకాదు..ఎవనైనా బుక్స్ డోనేట్ చేసే వాళ్లు ఉంటే.. కాంటాక్ట్ అవ్వమని చెబుతున్నారు.

Advertisement

Next Story