బీసీలను అణగదొక్కడమే జగన్ లక్ష్యం.. అచ్చెన్నాయుడు ఫైర్

by srinivas |   ( Updated:2021-11-23 06:47:29.0  )
Achennayudu
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం బీసీలను అడుగడుగునా నయవంచనకు గురి చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ల కోతతో.. 16,800 మంది పదవులకు దూరమయ్యారని ఆరోపించారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే తెలుగుదేశం తీర్మానం చేసిందని.. మళ్లీ తీర్మానం పేరుతో బీసీలను జగన్ మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై ఒత్తిడేదీ.? అని ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు లేదు. బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన సాగిందని ఆరోపించారు.

బీసీలకు పదవులు పేరుకే.. రెడ్డి షాడోలదే పెత్తనం..

వైసీపీ ప్రభుత్వం పేరుకే బీసీలకు పదవులు కట్టబెట్టిందని కానీ పెత్తనం చేసేది మాత్రం రెడ్డి షాడోలేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లుగా ఉన్న బీసీలకు షాడోలను నియమించడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. తిరుపతి మేయర్ బీసీని నియమించి రెడ్డి షాడోను నియమించడం వాస్తవం కాదా? అని నిలదీశారు. మంత్రులనూ స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదని ధ్వజమెత్తారు. వెయ్యికిపైగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో బీసీలు 10శాతం కూడా లేరని చెప్పుకొచ్చారు. 16 వర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా టీడీపీ బీసీలను నియమిస్తే ఈ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.

కేబినెట్ హోదా కలిగిన పదవుల్లో బీసీల స్థానమెంత?

ప్రతిష్టాత్మక సంస్థలు, కేబినెట్‌ హోదా కలిగిన పదవుల్లో బీసీల స్థానమెంత.? అని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ సలహదారుల్లో 71%, యూనివర్శిటీ వీసీల్లో 83% సొంత సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ న్యాయవాదులు 53%, వర్సిటీ సెర్చ్‌ కమిటీల్లో 75% సొంతవారే కాదా అని ప్రశ్నించారు. టీటీడీ బోర్డులో 31%, విప్‌లలో 50%, వర్శిటీ ఈసీ మెంబర్లలో 28% సొంతవారనేది వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీ కార్పొరేషన్ల నుండి రూ.18,226 కోట్లు మళ్లించడం ద్రోహం కాదా.? అంటూ మండిపడ్డారు. 7 లక్షల మంది స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తు చేస్తే.. ఒక్కరికీ ఇవ్వలేదన్న ఆయన టీడీపీ ఇచ్చిన రుణాలు రద్దు చేయడం ద్రోహమా.. ఉద్దరించడమా.? వైసీపీ ప్రభుత్వమే తేల్చాలని ప్రశ్నించారు. బీసీ భవనాలు, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, సివిల్స్ కోచింగ్ రద్దు చేశారు. బీసీ సంక్షేమంపై వైసీపీకి ధైర్యముంటే చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు.. వారికి బాబు స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

Next Story

Most Viewed