చిరుకు డీహైడ్రేషన్‌.. ఇల్లందుకు గుడ్‌బై చెప్పిన ‘ఆచార్య’ యూనిట్

by Jakkula Samataha |
చిరుకు డీహైడ్రేషన్‌.. ఇల్లందుకు గుడ్‌బై చెప్పిన ‘ఆచార్య’ యూనిట్
X

దిశ, సినిమా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరగాల్సిన ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడింది. ఈ నెల 15 వరకు చిత్రీకరణ జరగాల్సి ఉండగా.. మెగాస్టార్ చిరంజీవికి డీహైడ్రేషన్ సమస్య తలెత్తడంతో ప్రస్తుతానికి వాయిదా వేసింది మూవీ యూనిట్. కాగా తిరిగి ఈ నెల 12 నుంచి సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్‌లో సోనూ సూద్‌పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనన్నారని సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ పూర్తి కాగా.. చిరు పోర్షన్ మాత్రం మిగిలిపోయిందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో షెడ్యూల్ పూర్తయ్యాక ఇల్లందులో ఏడు రోజుల షూటింగ్ జరగాల్సి ఉంది.

కానీ ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో .. చిరుతో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూ కూడా ఇబ్బంది పడినట్లు సమాచారం. ముఖ్యంగా చిరు డీహైడ్రేషన్‌తో ఆందోళన చెందిన మూవీ యూనిట్ వెంటనే చిత్రీకరణ వాయిదా వేసి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు.

Advertisement

Next Story