ఐదు రాష్ట్రాల్లో దొంగతనాలు.. బెల్లంపల్లిలో చోరీ చేద్దామని..

by Aamani |   ( Updated:2021-10-01 07:17:59.0  )
Accused arreste
X

దిశ, మంచిర్యాల: దేశంలో ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగ మంచిర్యాల పోలీసులకు చిక్కాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ వెంకన్న పలు రాష్ట్రాల్లో వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ఈక్రమంలో బెల్లంపల్లిలో చోరీకి వెళ్తుండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ అఖిల్ మహాజన్ విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ‘‘పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో వెళ్తున్న రాయపాటి వెంకయ్య అనుమానస్పదంగా వ్యవహరించాడు. అతడిని వివరాల కోసం ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. వెంకయ్యపై అనుమానం రావడంతో స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా అంతర్ రాష్ట్ర దొంగగా తేలింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు తాళం వేసి ఉన్న వాహనాలు చోరీ చేసి అమ్మడం, ఇళ్లల్లో దొంగతనం చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు.

Interstate thief

నిందితుడు జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్, చెన్నూర్‌లలో తాళం వేసి ఉన్నఇళ్లలో బంగారం, వెండి, నగదు చోరీ చేశాడు. తాజాగా బెల్లంపల్లిలో దొంగతనం చేసేందుకు కారులో వెళుతుండగా పట్టుబడ్డాడని’’ ఏసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. అతడి వద్ద నుండి 423.3 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.30 వేలు నగదు(మొత్తం విలువ 9.21 లక్షలు), వేట కొడవళ్లు, కత్తులు, ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ వివరించారు.

Manchiryala Police

Advertisement

Next Story

Most Viewed